ప్రతి విద్యార్థినికి అండగా ‘పోలీస్ అక్క’

  • భయపడొద్దు.. ‘పోలీస్ అక్క’ను ఆశ్రయించండి
  • జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు,

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 09: విద్యార్థినుల్లో భద్రతా భావన పెంపొందించడం, మహిళల రక్షణపై అవగాహన కల్పించడం, వారికి స్నేహపూర్వక పోలీసు సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ పోలీసు శాఖ చేపట్టిన ‘పోలీస్ అక్క’ కార్యక్రమాన్ని మెదక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి విద్యాసంస్థలో విద్యార్థినులకు భరోసాగా నిలవడమే ‘పోలీస్ అక్క’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. విద్యార్థినులు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా భయపడకుండా పోలీస్ అక్క’ను సంప్రదించాలని సూచించారు. మహిళలు, బాలికల భద్రతకు తెలంగాణ పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ఫిర్యాదును సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

‘పోలీస్ అక్క’ విద్యాసంస్థలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ విద్యార్థినులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారని తెలిపారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, బాల్య వివాహాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. అవసరమైన సందర్భాల్లో బాధితులకు పోలీసు, న్యాయపరమైన సహాయం అందేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించి సహాయం అందించడం ‘పోలీస్ అక్క’ ప్రధాన బాధ్యతలని వివరించారు.

సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని, గుర్తు తెలియని వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు, బ్యాంకు సమాచారం పంచుకోవద్దని విద్యార్థినులకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్–112, షీ టీమ్స్, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్–1930 సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.విద్యార్థినులు ఆత్మవిశ్వాసంతో చదువుకొని జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని, ఎలాంటి సమస్య ఎదురైనా దాచిపెట్టకుండా తల్లిదండ్రులు, అధ్యాపకులు లేదా పోలీస్ అక్క’కు తెలియజేయాలని ఎస్పీ సూచించారు.ఈ కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, కళాశాల ప్రిన్సిపాల్, సీఐలు రేణుక, కృష్ణమూర్తి, పోలీసు సిబ్బంది, అధ్యాపకులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News