Trending Now

‘నక్కజిత్తుల వేశాలు’.. కేసీఆర్​పై సీఎం రేవంత్​ ఫైర్

ప్రతిపక్షం స్టేట్​బ్యూరో, హైదరాబాద్​ ఏప్రిల్​ 2: మాజీ సీఎం, టీఆర్​ఎస్​ అధ్యక్షుడు నక్కజిత్తుల వేశాలు వేస్తున్నాడని, ప్రజలు ఆయన నక్కజిత్తులను నమ్మే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల సూర్యాపేట జిల్లా పర్యటనలో కరవుకు కాంగ్రెస్​ కారణం అంటున్నాడని, ఆయన మందు తాగి మాట్లాడుతుండో ఏమో తెల్వదన్నారు. వానాకాలం ఎప్పుడన్న సోయి కూడా ఆయనకు లేదా? అని ప్రశ్నించారు. వానాకాలంలో ఆయన సీఎంగా ఉన్నాడని, ఆయన పాపాలు చూసి వరుణదేవుడు సైతం రాష్ట్రంలో కరుణ చూపించలేదని ధ్వజమెత్తారు. డిసెంబర్​ 7న అధికారంలోకి వచ్చామని, అప్పుడు చలికాలం కదా? అని ప్రశ్నించారు. కేసీఆర్​ పదేళ్లు చేసిన పాపాలను తాము సరి చేస్తున్నామన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఈనెల 6న నిర్వహంచనున్న ‘జనజాతర’ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం వెంట జిల్లా ఇంచార్జీ మంత్రి శ్రీధర్​బాబు, చేవేళ్ల లోక్​సభ అభ్యర్థి గడ్డం రంజిత్​రెడ్డి, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి, మహేశ్వరం పార్టీ ఇంచార్జీ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, సీనియర్​ నేతలు మల్​రెడ్డి రాంరెడ్డితో పాటు పలువురున్నారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్​ మాట్లాడుతూ.. లోక్​సభ ఎన్నికలను దృష్ఠిలో పెట్టుకొని కేసీఆర్​ చీఫ్​ పాలిటిక్స్​ చేస్తున్నారని ధ్వజమెత్తారు. వేసవిలో భూగర్భజలాలు అడుగంటిపోయాయన్నారు. దీంతో ప్రభుత్వం తాగునీటితో పాటు విద్యుత్​కోతలు లేకుండా చర్యలు తీసుకుంటున్నదన్నారు. కేసీఆర్​ పర్యటన సందర్భంగా మీడియా సమావేశంలో జనరేటర్​ ద్వారా ప్రసంగించారని, అయితే జనరేటర్​ ఆగిపోయి మైక్​ రాలేదని, దీనిపై కరెంటు కోత అన్నాడన్నారు. జనరేటర్​మీ మూడడుగుల జగదీశ్​రెడ్డి ఏం కట్టేపెట్టిండో చూసుకోకుండా ప్రభుత్వాన్ని బదలాం చేయడం పదేళ్లు సీఎంగా చేసిన ఆయనకు భావ్యమా? అని ప్రశ్నించారు.

పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కసారి కూడా రైతుల సమస్యలు తెలుసుకునేందుకు బయటి రాలేదని, అధికారం పోయిన పదేళ్ల తర్వాత అయినా మాజీ సీఎం కేసీఆర్ ‘పొలం బాట’ పట్టడం సంతోషమని చెప్పారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయినందుకు, కవిత జైలుకు పోయినందుకు కేసీఆర్‌ను చూస్తుంటే జాలి కలుగుతుందని అన్నారు. కేసీఆర్‌కు ఏ సీజన్ ఎప్పుడు వస్తుందో తెలియదా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాపాలతోనే ఈ కరువు పరిస్థితులు వచ్చాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాపాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలో రాయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

69 లక్షల రైతులకు రైతు బంధు..

కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన మూడుమాసాల్లోనే ఇప్పటికి 69లక్షలకు పైగా రైతులకు రైతు బంధు పథకం ద్వారా డబ్బులు వేశామని, ఇక 5 లక్షల మందికి మాత్రమే వేయాల్సి ఉందని సీఎం తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు వేయడానికి 10 నెలల సమయం తీసుకుందని చెప్పారు. దీనిపై కూడా గగ్గోలు పెట్టి రాజకీయలబ్ధికోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రైతు బంధు, రైతు భీమాతో పాటు ఆరు గ్యారంటీలను కాంగ్రెస్​ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.

రైతులపై కేసీఆర్‌ది కపట ప్రేమ..

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ మొన్నటి పర్యటనలో జనరేటర్‌తో ప్రెస్‌మీట్ పెట్టి విద్యుత్ పోయిందని తమ ప్రభుత్వంపై నిందలు వేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తాము ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే తమను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేశారనీ.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. తాము తలుచుకుంటే కేసీఆర్ బయటకు వెళ్లేవారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఖాతాలో రూ. 1500 కోట్లు ఉన్నాయని.. రైతులకు ఓ రూ.100 కోట్లు సహాయం చేయొచ్చు కదా అని చెప్పారు. అలా చేస్తే రైతులు సంతోషించేవారు కదా అని అన్నారు. ఎన్నికల కోసమే కేసీఆర్ రైతుల పేరిట కపట ప్రేమ చూపుతున్నారని విరుచుకుపడ్డారు.

ఢిల్లీ అందుకే వెళ్తున్నాం..

కేసీఆర్ న్యాయమైన సలహాలు, సూచనలు ఇస్తే అమలు చేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. తాము ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి తెలంగాణ హక్కులు సాధిస్తున్నామన్నారు. కేసీఆర్ కుటుంబ దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని అన్నారు. కేసీఆర్ పాపాల వల్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు పారిపోతున్నారని అన్నారు. ఆ పార్టీ నేతలను కాపాడుకోవడానికి కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ చెల్లని వెయ్యి రూపాయల నోటని ఎద్దేవా చేశారు. జూన్ 9వ తేదీ తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని అన్నారు. ఆ రోజే ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్‌లో కొత్త పథకాలను అమలు చేయడానికి అవకాశం లేకుండా పోయిందని అన్నారు.

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే..

ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని పథకాలను రాష్ట్రంలో అమలు చేసేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని సమస్యలు ఉన్నాయని నీళ్లు ఎత్తిపోయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. వేసవిలో నీటి సమస్యలు రాకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని. ఈ రెండు పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో కుట్రకు తెరదీశాయని అన్నారు. చనిపోయిన రైతుల వివరాలు ఇచ్చేందుకు కేసీఆర్‌కు 48 గంటల సమయం ఇస్తున్నానని అలోగా ఆ వివరాలు ఇస్తే ఎన్నికల కోడ్ ముగియగానే రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

కాంగ్రెస్​కు 40 సీట్లు వస్తాయని కేటీఆర్​ అంటుండు అని ప్రశ్నించగా రేవంత్​ తీవ్రస్థాయిలో స్పందించారు. కాంగ్రెస్​కు 40 సీట్లు వస్తాయని ఆయన అంటే బీజేపీకి 400సీట్లు వస్తాయన్నట్లే కదా? అని ప్రశ్నించారు. దీంతోనే బీఆర్​ఎస్​ ఎవరికి మద్దతు ఇస్తుందో తెలిసిపోతుందన్నారు. ఏదీ ఏమైనా ఈ సారి కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి రాష్ట్రం నుంచి భారీ ఎత్తున ఢిల్లీ తరలిరావాలని రేవంత్​ పిలుపునిచ్చారు.

జనజాతరకు 10 లక్షల మంది..

తుక్కుగూడలో ఈనెల 6వ తేదీన ఏఐసీసీ ‘జనజాతర’ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసిందని.. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మంగళవారం నాడు తుక్కుగూడ సభా ప్రాంగణాన్ని సీఎం సభ ఏర్పాట్లు, ఇతర అంశాలపై నిర్వాహకులకు సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ… కాంగ్రెస్‌ కు తెలంగాణ కంచుకోట అని నిరూపిస్తామన్నారు. తుక్కుగూడ సభలో ఏఐసీసీ మ్యానిఫెస్టో విడుదల చేస్తుందని తెలిపారు.

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే.. రాష్ట్రానికి జరిగే మేలును ఈ సభ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. ఈ సభలో మహిళలకు ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీలను తెలంగాణలో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ రావడంతో పథకాలకు కొంత అంతరాయం కలిగిందని చెప్పారు. ఎన్నికల తర్వాత మిగతా హామీలను అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పదిలక్షల మంది హాజరవుతారని, అందుకు అనుగుణంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Spread the love