పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి

శాంతిభద్రతల పరిరక్షణలో వారి సేవలు మరువలేనివి: కలెక్టర్ ప్రతిమా సింగ్

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరులకు ఘన నివాళులు

ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్, అక్టోబర్ 21: శాంతిభద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.
బుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావుతో కలిసి పాల్గొన్నారు. ముందుగా పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించి అమరుల సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించి అమరులైన పోలీసుల త్యాగాలను గుర్తుచేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణతోపాటు జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, అకాల వర్షాలు, ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రతిరోజూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పోలీసుల ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకమన్నారు. అమరవీరుల త్యాగాలు వృథా కాకుండా, వారి స్ఫూర్తితో మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.సమాజం ఎల్లప్పుడూ వారి త్యాగాలకు రుణపడి ఉంటుందని పేర్కొన్నారు జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

మారుతున్న నేర స్వరూపానికి అనుగుణంగా పోలీసులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ సైబర్ నేరాలను తక్కువ సమయంలోనే ఛేదించి నేరస్థులను పట్టుకుంటున్నారని ప్రశంసించారు.అనంతరం పోలీసు అమరవీరుల కుటుంబాలకు కలెక్టర్, ఎస్పీ బహుమతి ప్యాకెట్లు అందజేశారు. వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News