గిగ్‌ వర్కర్ల కోసం రాహుల్‌గాంధీ భారీ ర్యాలీ

ప్రతిపక్షం, నవంబర్ 12: గిగ్‌ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రతకు భరోసా కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ సమీపంలో గిగ్‌ వర్కర్లతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరుకానున్నారు. గిగ్‌ వర్కర్లకు ప్రయోజనం చేకూర్చేలా రూపొందించిన కీలక నిబంధనలు, సంక్షేమ పథకాలను ఆయన చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు సమాచారం. ర్యాలీలో పాల్గొనే కార్మికులతో రాహుల్‌గాంధీ నేరుగా మాట్లాడి, వారి సమస్యలు, పని పరిస్థితులు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సామాజిక భద్రతకు సంబంధించిన అంశాలను తెలుసుకోనున్నారు. గిగ్‌ వర్కర్లకు మెరుగైన భద్రత, సంక్షేమ ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సభా ప్రాంగణం, ర్యాలీ నిర్వహించే ప్రాంతాల్లో ఏర్పాట్లను ప్రభుత్వం వేగవంతం చేసింది. జయభేరి, మీనాక్షి టవర్స్‌ సమీపంలోని మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి పరిశీలించారు. సభకు వచ్చే కార్మికులు, ఇతర ప్రతినిధులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, ర్యాలీ సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయడం, భద్రతా చర్యలు చేపట్టడం వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. గిగ్‌ వర్కర్లకు సంక్షేమ పథకాలు, సామాజిక భద్రత కల్పించే అంశంపై ఈ కార్యక్రమంలో ప్రభుత్వం తన కార్యాచరణను వెల్లడించే అవకాశం ఉంది. రాహుల్‌గాంధీ పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈ కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది.

Related News

Latest News