[t4b-ticker]

స్థానిక యువతకు ఉపాధే లక్ష్యం.. పరిశ్రమలకు అన్ని సౌకర్యాలు: మంత్రి శ్రీధర్ బాబు

ప్రతిపక్షం, ఆగస్టు 04: రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ఆకర్షించి స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంథని నియోజకవర్గంలో సోమవారం పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించి అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

పర్యటనలో భాగంగా శివకిరణ్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ‘మన ఊరు–మన కోచింగ్ సెంటర్’ ఉచిత కానిస్టేబుల్, ఎస్సై కోచింగ్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు క్రమశిక్షణతో మూడు నెలలు కష్టపడి చదివితే ఉద్యోగాలు సాధించే అవకాశం మెరుగవుతుందని చెప్పారు. కోచింగ్‌తో పాటు పుస్తకాలు, భోజనం, వసతి వంటి సౌకర్యాలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అనంతరం పెద్దపల్లి జిల్లా కలెక్టర్, హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైన మంత్రి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు విద్యుత్, నీరు, రహదారులు వంటి అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. పారిశ్రామిక అభివృద్ధి ద్వారానే స్థానిక యువతకు అధిక ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

సీఎస్‌ఆర్ నిధులతో హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ చేపడుతున్న ‘ప్రాజెక్ట్ షైన్’ కింద రూ.2 కోట్లతో బొక్కలవాగు చెక్‌డ్యామ్ అభివృద్ధి, సుందరీకరణ పనులకు మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల పార్క్, గార్డెనింగ్, పూడికతీత పనులను నాణ్యతతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.

రత్నాపూర్‌లో ప్రతిపాదిత కోకాకోలా పరిశ్రమ స్థలాన్ని పరిశీలించిన మంత్రి, భూసేకరణ, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ పరిశ్రమ ద్వారా స్థానిక యువతకు గరిష్ట స్థాయిలో ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కంపెనీ ప్రతినిధులను కోరారు.

మంథని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, మందుల కొరత లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. ఆసుపత్రి మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నిధులు ప్రభుత్వం నుంచి అందజేస్తామని హామీ ఇచ్చారు.

మంథని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News