ప్రతిపక్షం, జూన్ 10: రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ స్పందించారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
సామాజిక మాధ్యమ వేదికగా స్పందించిన సింఘ్వీ, మీనాక్షి నటరాజన్‌కు సంబంధించి ప్రస్తావిస్తున్న అంశం ఇంకా కోర్టు విచారణ దశలోనే ఉందన్నారు. కోర్టు నోటీసులు జారీ చేసినంత మాత్రాన అది క్రిమినల్ కేసుగా పరిగణించలేమని స్పష్టం చేశారు. వాదనలు విన్న తర్వాతే ఫిర్యాదును విచారణకు స్వీకరించాలా లేదా అన్న విషయంపై న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
ఏ ఫిర్యాదైనా కోర్టు అధికారికంగా విచారణకు స్వీకరించే వరకు దానిని క్రిమినల్ కేసుగా పరిగణించరాదని, ఈ అంశంపై ఇప్పటికే ఉన్నత న్యాయస్థానాల తీర్పులు కూడా ఉన్నాయని సింఘ్వీ పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో నామినేషన్‌ను తిరస్కరించడం చట్టపరంగా సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు.
ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా స్పందించారు. ఈ వ్యవహారం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించిన ఆమె, ప్రజాస్వామ్య ప్రక్రియలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తామని ప్రకటించగా, ఈ వ్యవహారం రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

















