హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వద్ద ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో పలు శాఖల్లో కీలక అధికారిగా పనిచేసి ప్రజల మన్ననలను పొంది జన్నత్ హుస్సేన్ మృతిచెందారు. జన్నత్ హుస్సేన్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీగా పని చేసిన జన్నత్ హుస్సేన్ తెలుగు రాష్ట్రానికి సుధీర్ఘ సేవలు అందించారని సీఎం గుర్తు చేసుకున్నారు.
జన్నత్ హుస్సేన్ ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీగా పని చేసి స్పెషల్ సీఎస్ హోదాలో రిటైరయ్యారు. తర్వాత సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్ గా పని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో అమల్లోకి తెచ్చిన ఉచిత విద్యుత్ పథకం విధివిధానాలను రూపొందించి రైతులకు మేలు చేయటంలో ఆయన విశేషంగా కృషి చేశారు. జన్నత్ హుస్సేన్ మృతి పట్ల ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.