ప్రతిపక్షం, జూన్ 09: రాష్ట్ర రాజధానిని దేశంలోనే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రూ.1,674.74 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ నగర విస్తరణకు అనుగుణంగా రవాణా, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీటి రంగాల్లో సమగ్ర ప్రణాళిక అమలు చేస్తున్నామని చెప్పారు. గాజులరామారంలో వంద ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయి బస్సు కేంద్రాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
నగర ప్రజల రాకపోకలను సులభతరం చేసేందుకు మెట్రో రైలు మార్గాల విస్తరణ చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే నగరంలో పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం పెద్ద ఎత్తున గృహ నిర్మాణ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.
వేగంగా పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకొని పరిపాలనను వికేంద్రీకరించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు సంబంధిత పరిపాలనా వ్యవస్థలను కూడా బలోపేతం చేసినట్లు చెప్పారు.
అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని, ప్రజల సంక్షేమం మరియు నగర భవిష్యత్ అవసరాలే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పక్షాలు అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు.




















