[t4b-ticker]

నల్లగొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

*బెస్ట్ కార్పొరేషన్ అవార్డే లక్ష్యం – 24 గంటల తాగునీటికి రూ.83 కోట్లతో టెండర్లు

*రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు.. 63 కి.మీ సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి.

*రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి .

ప్రతిపక్షం, సెప్టెంబర్ 22, నల్లగొండ: నల్లగొండ నగర రూపురేఖలను పూర్తిగా మార్చి, అన్ని మౌలిక సదుపాయాలతో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బెస్ట్ కార్పొరేషన్ అవార్డు సాధించడమే లక్ష్యంగా నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.

మంగళవారం నల్లగొండలోని శాంతి కళ్యాణ మండపం వద్ద మీడియాతో మాట్లాడారు.నగరంలో 24 గంటల తాగునీటి సరఫరా కోసం రూ.83 కోట్లతో టెండర్లు పిలిచినట్లు మంత్రి వెల్లడించారు. 63 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని తెలిపారు. ఎస్టీపీ నిర్మాణాన్ని ఆరు నెలల్లో పూర్తి చేస్తామని, నగర ప్రజల అవసరాల కోసం రూ.1.01 కోట్లతో రెండు వెండింగ్ మెషీన్ల కొనుగోలుకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు.నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఇటీవల స్వచ్ఛతా అవార్డు రావడం గర్వకారణమన్నారు. పరిశుభ్రత, పచ్చదనం, రహదారులు, డ్రైనేజీ, తాగునీరు తదితర రంగాల్లో సమగ్ర అభివృద్ధి చేపట్టి నల్లగొండను పరిశుభ్రమైన, హరిత నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

నగరానికి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా రూ.900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు శాశ్వత పరిష్కారాలు అందించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అధికారులను మంత్రి ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో నల్లగొండను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, కమిషనర్ వంశీకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News