ప్రతిపక్షం, జూన్ 19: హైదరాబాద్–పుణె బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి స్టేషన్ల ఎంపికపై కొత్త చర్చ మొదలైంది. బుల్లెట్ రైలు మార్గాన్ని అనంతగిరి, ఫ్యూచర్ సిటీ ప్రాంతాల మీదుగా తీసుకెళ్లే అవకాశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
అనంతగిరిలో బుల్లెట్ రైలు స్టేషన్ ఏర్పాటు చేస్తే పర్యాటక రంగానికి ఊతమివ్వడంతో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా ఫ్యూచర్ సిటీ పరిధిలో స్టేషన్ ఏర్పాటైతే పారిశ్రామిక పెట్టుబడులు, మౌలిక వసతుల అభివృద్ధికి మరింత ఊతం లభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
మొదట బుల్లెట్ రైలు స్టేషన్ను కోకాపేటలో ఏర్పాటు చేసే ప్రతిపాదనపై చర్చ జరిగినప్పటికీ, భూసేకరణ వ్యయం భారీగా ఉండటంతో ఆ ప్రతిపాదనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్టేషన్ నిర్మాణానికి సుమారు 247 ఎకరాల భూమి అవసరమవుతుందని, ఆ ప్రాంతంలో భూముల విలువ అత్యంత అధికంగా ఉండటంతో భూసేకరణ ఖర్చు వేల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
దీంతో ప్రత్యామ్నాయ ప్రాంతాల పరిశీలనపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు సమాచారం. తుది నిర్ణయం తీసుకునే ముందు సాంకేతిక, ఆర్థిక, భౌగోళిక అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు తెలంగాణ భవిష్యత్ రవాణా వ్యవస్థలో కీలక మైలురాయిగా నిలవనున్న నేపథ్యంలో స్టేషన్ల ఎంపికపై ప్రభుత్వం జాగ్రత్తగా ముందుకు సాగుతోంది.

















