ప్రతిపక్షం, ఏపీ: ఏపీలో అధికార పార్టీ వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీని వీడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన తెలిపారు. కాసేపటి క్రితం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ అని చెప్పారు. 8 సార్లు పార్లమెంటుకు, 2 సార్లు శాసనసభకు, ఒకసారి ఎమ్మెల్సీ పదవికి మొత్తం 11 సార్లు చట్ట సభలను పోటీ చేశానని తెలిపారు. తమ కుటుంబానికి అహం లేదని, ఆత్మగౌరవం మాత్రమే ఉందని చెప్పారు. వైసీపీని వీడటం బాధాకరమే అయినప్పటికీ తప్పడం లేదని అన్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేమని చెప్పారు. ఒంగోలు ఎంపీ బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించామని తెలిపారు.