ప్రతిపక్షం, జూన్ 02: రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల వద్ద ఉన్న ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, వర్షాలకు తడిసిన ధాన్యానికీ కనీస మద్దతు ధర అందిస్తామని హామీ ఇచ్చారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక సభలో మాట్లాడిన సీఎం, ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. మద్దతు ధర ప్రకటించడమే కాకుండా పండించిన పంటను కొనుగోలు చేయడం కూడా కేంద్ర బాధ్యతేనని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, మొత్తం 75 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు వంటి పంటలను కూడా కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని సీఎం కోరారు. ఈ అంశంలో కేంద్రం చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో వివక్ష కొనసాగితే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
ఆదివాసీ ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టామని, గూడాలు, తండాల్లో గుడిసెలు లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి అర్హ కుటుంబానికి పక్కా ఇల్లు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ప్రజల సంక్షేమం, రైతుల ప్రయోజనాలు, ఆదివాసీల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.




















