ప్రతిపక్షం, జూలై 13: షాబాద్‌లో ఆరుగురు హత్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి వెల్లడించారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కనిపించిందంటూ డయల్–100కు సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా, అది రాజ్‌కుమార్ మృతదేహమేనని నిర్ధారించినట్లు తెలిపారు.
మృతదేహం వద్ద లభించిన ఆధారాల ప్రకారం అతడి జేబుల్లో కొన్ని వ్యక్తిగత వస్తువులు, బస్సు టికెట్లు, రూ.1,260 నగదు, మొబైల్ ఫోన్ లభించాయని సీపీ చెప్పారు. ప్రాథమికంగా అతడు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు.
అయితే మరణానికి గల అసలు కారణం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతుందని సీపీ వివరించారు. ఫోరెన్సిక్ నివేదికలు, వైద్య పరీక్షల అనంతరం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.

















