Trending Now

గరీబోడికి బలమైన ఆయుధం ఓటు..

సంక్షేమాభివృద్దిపై ఆలోచన చేయండి

కొప్పుల ఈశ్వర్‌కి మద్దతుగా ప్రచారం..

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

ప్రతిపక్షం, మంథని రామగిరి మే 04 : గరీబోడికి బలమైన ఆయుధం ఓటు అని, ఓటు విలువ ఎంత గొప్పదో ఆలోచన చేయాలని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్టమధూకర్‌ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో బాగంగా మంథని మండలం మల్లారం, ఆరెంద గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హమీ పని ప్రదేశాల్లో పెద్దపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు విలువ తెలుసుకోకపోతే బాగుపడుమని గుర్తించాలన్నారు. మీరు వేసిన ఓటుతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన మంథని ఎమ్మెల్యే నిన్నటి వరకు అనేక సమావేశాల్లో భయబ్రాంతులకు గురి చేశారని, ఇప్పటి వరకు 35ఎంఎం ట్రైలర్‌ చూపించామని, ఇక నుంచి 70ఎంఎం సినిమా చూపిస్తామని మాట్లాడారని ఆయన గుర్తు చేశారు.

అలాంటి ఎమ్మెల్యే ఈనాడు మన ఓటు కోసం ఉపాధి హమీ పని ప్రదేశాలకు వచ్చి గరీబోళ్ల నడుమ కింద కూర్చున్నాడని, ఓటుకు ఉన్న విలువ అలాంటిదని ఆయన వివరించారు. ఆనాడు ఓటు హక్కు కేవలం ధనవంతులు, విద్యావంతులు, భూస్వాములు, ఇన్‌కం టాక్స్‌ కట్టేవాళ్లకు మాత్రమే ఉండాలని అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం, బ్రాహ్మణీయ పాలకులు అంటే అంబేద్కర్‌ అందరికి ఓటుహక్కు ఉండాలని కొట్లాడి ఓటుహక్కు కల్పించారని ఆయన గుర్తు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్సోళ్ల మాటలు నమ్మి నాలుగు నెలలుగా గోసపడుతున్నామని,మళ్లీ నమ్మితే ఐదేండ్లు ఆగమై పోతామని అన్నారు.

ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీ పథకాలు చెప్పి వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేయకపోగా కేసీఆర్‌ ఇచ్చే రూ.2016పించన్‌ సొమ్మును రూ.2వేలు మాత్రమే ఇస్తున్నారని ఆయన అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఏనాడు ప్రజలకు ఇబ్బందులు రానియ్యలేదని, ప్రజల అవసరాలను గుర్తించే పథకాలకు రూపకల్పన చేశారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా నాలుగున్నర ఏండ్లు ఈ ప్రాంత ప్రజలకు అనేక సేవలు అందించానని, అభివృద్ది పనులు చేస్తే, డబ్బులు సంపాదించుకుంటున్నాడని కాంగ్రెస్సోళ్లు బదనాం చేసి ప్రజల నుంచి దూరం చేశారని అన్నారు. గత ఎన్నికల్లో వంద కోట్లు ఖర్చు చేసి అధికారం చేజిక్కించుకున్నది ఎవరో ప్రజలు ఆలోచన చేయాలన్నారు.

తనలాంటి గరీబోళ్లు పైకి రావద్దని, రాజకీయంగా ఎదుగవద్దని కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని, 50ఏండ్లు వాళ్లు అధికారం ఇస్తే ఏం చేశారని ఆలోచన చేయాలన్నారు. మళ్లీ పార్లమెంట్‌ ఎన్నికలు రాగానే ప్రజల్లోకి వచ్చిమాయమాటలు చెప్తున్నారని, అబద్దాలతో అధికారంలోకి రావడం కాంగ్రెస్‌ నాయకులకు అలవాటేనని, అలాంటి అబద్దాలను నమ్మి మళ్లీ మోసపోవద్దని ఆయన సూచించారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అనేక సేవలు, అభివృద్ది పనులు చేసిన కొప్పుల ఈశ్వర్‌ను ఆశీర్వదించాలని, పెద్దపల్లి ఎంపీగా కొప్పుల ఈశ్వర్‌ను గెలిపిస్తే మనకు అండగా ఉంటారని, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకవుతారని ఆయన తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్‌ను బారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Spread the love

Related News