హరీశ్ రావు రావాలంటే పార్టీ నిర్ణయమే కీలకం.. మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు

ప్రతిపక్షం, జూలై 10: బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరితే ఆ అంశాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. హరీశ్ రావు చేరికపై వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయం ఉండదని, పార్టీ విధానాల ప్రకారమే తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

మీడియాతో మాట్లాడిన ఆయన.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలు, బ్యారేజీల సమస్యలపై ముందుగా హరీశ్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఖజానాపై భారీ భారం మోపిన కాళేశ్వరం వ్యవహారంలో బాధ్యత వహించాల్సిన వారు ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించడం సమంజసం కాదన్నారు.

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపైనా మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆయన మాటలు చూస్తుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా ఆ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదే సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో ఇటీవల చోటుచేసుకున్న కడియం శ్రీహరి–మంత్రి కొండా సురేఖ వివాదం, తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన అంశాలపై కూడా ఆయన స్పందించారు. ఈ వ్యవహారాలపై పార్టీ నియమించిన పరిశీలకులు తమ నివేదిక సమర్పించిన తర్వాత అధిష్ఠానం తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

రాష్ట్రంలో పార్టీ క్రమశిక్షణకు కాంగ్రెస్ అధిష్ఠానం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ఏ అంశమైనా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటామని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News