రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి సి. పార్థ సారధి ఓటర్లకు పిలుపు
ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో మీ శక్తి వంతమైన ఓటు ఆయుధాన్ని తప్పక వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి సి. పార్థ సారధి ఓటర్లకు పిలుపునిచ్చారు. బంజారాహిల్స్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో పార్థసారధి తన కుటుంబ సభ్యులతో కలసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాదారణ ఓటరుగా లైన్ లో నిలిచి తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టు లాంటిది మన ఓటు. ఐదేళ్ల మన భవిష్యత్తును నిర్ణయించేది ఓటు మాత్రమే అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం యువతకు వివిధ కారణాలవల్ల ఓటు పట్ల ఆసక్తి తగ్గుతోంది. “నేను ఒక్కణ్ని ఓటు వెయ్యకపోతే ఏమవుతుంది.. ఏం కాదులే” అని చాలా మంది భావిస్తున్నారు. నీటి చుక్కలన్నీ కలిస్తేనే సముద్రం అవుతుంది కదా.. అలాగే అందరూ ఓటు వేసినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. అంతేకాదు.. మీ ఓటు మీ వాయిస్. మీ ఓటు ద్వారా మీ గళాన్ని వినిపించే గొప్ప అవకాశం. ఓటు వేయడం మీ బాధ్యత మరియు హక్కు గా భావించాలి. ప్రతి ఓటు విలువైనదే కాబట్టి తప్పక వెళ్లి ఓటు వేయాలి. ఎన్నికల రోజు అంటే ఎంజాయ్ చేయడానికి ఇచ్చే సెలవు కాదు. విలువైన ఓటు వేయడానికి వచ్చిన ఒక సువర్ణావకాశం.