ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి: పదవ తరగతి పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక జుమ్మెరత్ పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించాలని అన్నారు. పరీక్షా కేంద్రంలో మంచినీరు, అత్యసర మందులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, పరీక్షల నిర్వహణలో కాపీయింగ్ జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలని భద్రతా సిబ్బందికి సూచించారు. పరీక్షా కేంద్రంలోనికి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించవద్దని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో జిరాక్స్, ఆన్లైన్ కేంద్రాలు, ప్రింటింగ్ దుకాణాలను మూసివేయాలని సూచించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆయా కేంద్రాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు పరీక్ష కేంద్రాల నిర్వహణపై సంబంధిత అధికారులు సిబ్బంది ని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలలో కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ స్థాయి సౌకర్యాలు కల్పించేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయనతోపాటు నిర్మల్ జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి.. సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు.