ప్రతిపక్షం, జూన్ 18: వనమహోత్సవ కార్యక్రమం కేవలం మొక్కలు నాటే కార్యక్రమం కాదని, పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకున్న దృఢ సంకల్పానికి ప్రతీక అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గుర్రంగూడలో ప్రారంభమయ్యే వనమహోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమ వేదికలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
2021లో గుర్రంగూడ ప్రాంతంలో వరదల సమయంలో పర్యటించిన సందర్భంలో తనకు కలిగిన ఆవేదనే ఈ కార్యక్రమానికి ప్రేరణగా నిలిచిందని తెలిపారు. ప్రకృతి విపత్తుల వల్ల ఎదురైన నష్టాలు, విధ్వంసకర పరిస్థితులు తనను ఆలోచింపజేశాయని పేర్కొన్నారు.
ఆ అనుభవాల నుంచి పుట్టిన ఆలోచనకు ఆచరణ రూపమే ప్రస్తుత వనమహోత్సవ కార్యక్రమమని ముఖ్యమంత్రి వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, భవిష్యత్ తరాలకు మెరుగైన ప్రకృతి సంపద అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
















