Trending Now

సిద్ధిపేట జిల్లాలో గ్రామ బహిష్కరణ కలకలం..

గ్రామ బహిష్కరణపై జిల్లా కలెక్టర్ కు వినతి

ప్రతిపక్షం, దుబ్బాక మార్చి 22: సిద్దిపేట జిల్లాలో ఒక కులాన్ని గ్రామ బహిష్కరణ చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుమారు 20 ముదిరాజు కుటుంబాలు 1994లో మత్స్య పారిశ్రామిక సోసైటీగా ఏర్పాటు చేసుకుని జిల్లా మత్స్య సహకార సంఘంలో నమోదు చేసుకున్నారు. అప్పటి నుంచి గ్రామంలోని చెరువులు, కుంటలలో చేపలు పెంచి, వాటినే అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత 5 నెలల క్రితం గ్రామ మత్స్య సహాకార సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని, సోసైటీలో సభ్యులలో కొంత మంది మరణించారని, వారి స్థానంలో వారసులకు నూతన సభ్యత్వం ఇవ్వాలని సంబందిత జిల్లా మత్స్య సంఘానికి వినతి పత్రాన్ని అందజేశారు.

సంబంధిత అధికారి ఈ నెల 15న గ్రామంలోని సోసైటీకి ఈ నెల 21న ఎన్నికలు నిర్వహిస్తామని నోటీసులు అందజేశారు. సోసైటీ ఎన్నికలకు గ్రామంలోని ముదిరాజు కులస్థులు సర్వం సిద్ధం చేసుకున్నారు. గ్రామానికొస్తానని చెప్పిన జిల్లా అధికారి ఎంతకీ రాకపోవడంతో ఫోన్ ద్వారా సంబంధిత అధికారికి అడగగా మీ గ్రామంలో కొంతమంది ఫోన్ ఎన్నికలు నిర్వహించొద్దని బెదిరించాని అందుకే రావడంలేదని తెలపడంతో ఖంగుతిన్నారు. మేమేవ్వరికి అన్యాయం చేయలేదని, తామేమి తప్పు చేయలేదని, తమ కుల వృత్తిని చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని జిల్లా అధికారితో ఫోన్లో వాపోయారు. చెరువులు, కుంటలపై కన్నుపడ్డ గ్రామానికి చెందిన కొంతమంది రాజకీయ నాయకులు అదే రోజు రాత్రి ముదిరాజు కులస్థులకు రేపటి నుంచి మంగళి వృత్తి చేయోద్దని, బట్టలు ఉతకొద్దని, హోటళ్లలో చాయ్ పోయోద్దని, కల్లు ఇవ్వొద్దని, ఎవరైన చనిపోతే చావు డప్పులు కొట్టొద్దని, కిరాయికి ఇళ్లను ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు.

గ్రామ కట్టు బాట్లను ఉల్లంఘించిన వ్యక్తులకు రూ. 5 వేల జరిమాన విధిస్తామని, గ్రామ బహిష్కరణకు గురైన వ్యక్తులకు ఎవరైన సహకరించినట్లు సమాచారం ఇచ్చిన వ్యక్తులకు రూ. 2 వేల బహుమానం ఇస్తామని హుకుమ్ జారీ చేశారు. గ్రామ బహిష్కరణకు గురైన బాధితులు తమకు జరగుతున్న అన్యాయాన్ని, తమకు న్యాయం చేయాలని శుక్రవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలి నేని మను చౌదరి కి వినతి పత్రాన్ని అందజేశారు. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. వారి వెంట ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగి టి శ్రీనివాస్, జేఏసీ సోషల్ మీడియా కన్వీనర్ రావుల రాజ్, నియోజకవర్గం కన్వీనర్ పడిగ ప్రశాంత్, టౌన్ అధ్యక్షుడు మిద్దె రవి, జేఏసీ యువత అధ్యక్షుడు శ్రీనివాస్, నియోజక వర్గం ప్రధాన కార్యదర్శి పుల్లురి సుధాకర్ తదతరులు పాల్గొన్నారు.

Spread the love