హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: ‘‘చలో మేడిగడ్డ’’ బయలుదేరిన బీఆర్‌ఎస్ కాన్వాయ్‌లోని ఓ బస్సు టైర్ పగడంతో చిన్న అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తున్న బస్సు టైర్ పగిలింది అని చూశా. కారు టైర్లు అన్నీ మిగిలిపోయాయి. ఇక షెడ్డుకు పోవాల్సిందే’’ అంటూ మంత్రి సెటైరికల్ కామెంట్స్ చేశారు. సచివాలయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్ లో ఉత్తమ్ ఇంకా మాట్లాడుతూ.. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ కుంగిపోయిందని.. తాము అధికారంలోకి వచ్చేవరకు కేసీఆర్ నోరు మెదపలేదన్నారు.
నల్లగొండ సభలో ఏం మాట్లాడలని కేసీఆర్ వెళ్లారని ప్రశ్నించారు. తెలంగాణని నాశనం చేసి మళ్ళీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదన్నారు. మేడిగడ్డపై ఎన్‌డీఎస్‌ఏకు పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. మేడిగడ్డ దగ్గరకి బ్యారేజీ తరలించేందుకే తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత తక్కువ అని కేసీఆర్ చెప్పారని.. సీడబ్ల్యూసీ చెప్పిందని కేసీఆర్ అబద్ధం చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ అబద్దాన్ని అప్పట్లో కేంద్రంపై నెట్టే యత్నం చేశారన్నారు.
బాధ్యులపై చర్యలు తప్పవు..
మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక త్వరలో వస్తుందని.. బాధ్యుల పేర్లతో సహా నివేదిక వస్తుందని ఉత్తమ్ తెలిపారు. నివేదిక అనుగుణంగా బాధ్యులపై చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. అయితే లక్షకోట్లు వెచ్చించి నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు నేడు వృధాగా పడి ఉందని, దీనికి కారణం బీఆర్‌ఎస్ పాలకులు కాదా? అని ప్రశ్నించారు. నవ్విపోతే నాకేందుకు అన్న చందంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మేడికడ్డ, కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారన్నారు. లక్షకోట్ల ప్రజా ధనాన్ని కొల్లగొట్టిన బీఆర్‌ఎస్ నేతలేనన్న నగ్న సత్యం ప్రజలకు తెలిసిపోయిందని, అయితే ప్రజలను పక్కదారి పట్టించే యత్నంలోభాగంగానే పరిశీలన అని ఉత్తమ్ అన్నారు.