Trending Now

వామ్మో..‘ఇసుక’.. భారీగా పెరిగిన ధరలు

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ధరలు భారీగా పెంచేశారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేని విధంగా ఇసుక ధరలు పెరిగాయి. గత నెలలో మైనింగ్​శాఖ సమీక్షలో సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అడ్డుకోవాలని, ఇసుక మాఫియాను అరికట్టాలని ఆదేశించిన విషయం తెలిసిందే!. దీంతో మైనింగ్​శాఖ అధికారులు ఇసుక రీచ్​ల వద్ద ఇసుక లోడింగ్​ను జాప్యం చేయడం, కొన్ని ఇసుక క్వారీలను మూసి వేయడంతో అమాంతం ఇసుక లారీల ఓనర్లు ఒక్క సారిగా ఇసుక ధరలను పెంచేశారు. గత జనవరిలో టన్ను ఇసుక దొడ్డుది (స్లాబ్​) రూ.1150 నుంచి రూ.1200 వరకు, అలాగే సన్నది( ప్లాస్టరింగ్) టన్ను ఇసుక రూ.1700 నుంచి 1800 ఉంది. అయితే సీఎం ఆదేశంతో ఇసుక రీచ్​ల వద్ద సిబ్బంది లోడింగ్​ సమయంలో పాసింగ్​ను అమలు చేస్తున్నారు. అయితే లారీల కెపాసిటీకి తగ్గట్టు(పాసింగ్​) ఇసుకను మాత్రమే లోడింగ్​ చేస్తున్నారు.

అయితే గతంలో లోడింగ్​ సమయంలో అక్కడి సిబ్బంది చేతులు తడిపితే ఒక బకెట్​ అధికంగా లోడింగ్​ చేసేవారు. దీనితో పాటు గతంలో రెండు, మూడు రోజులకు ఓ లారీ లోడింగ్​ అయ్యేదని, ప్రస్తుతం ఇసుకకు వెళ్లిన లారీ వారం పాటు నదిలో(ఇసుక రీచ్​) వద్ద పడిగాపులు పడాల్సి వస్తుందని లారీ ఓనర్లు తెలుపుతున్నారు. దీంతో వారం రోజులపాటు లారీ వెయిటింగ్​చార్జీలను కలుపుకుని ఇసుకను విక్రయిస్తున్నామని దీంతో ధర బాగా పెరిగిపోయిందంటున్నారు. దీంతో టన్ను ఇసుక దొడ్డుది(స్లాబ్​)2200 నుంచి 2300, అలాగే సన్న ఇసుక (ప్లాస్టరింగ్​) రూ.2800 నుంచి రూ.3000కు పెరిగిపోయింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ధరలు భారీగా పెరగడంతో నిర్మాణాలు ఆగిపోయాయని, పని కూడా దొరకడం లేదని నిర్మాణరంగ కార్మికులు, మేస్త్రీలు వాపోతున్నారు. అయితే దూరాన్ని బట్టి ఇసుక ధరల్లో కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది.

రెన్యూవల్​ చేయడంలో జాప్యం..

గత ప్రభుత్వంలో రెండేళ్ల క్రితం (2022) పెద్దపల్లి జిల్లాలోని మానేరు, హుస్సేన్‌మియా వాగులపై టీఎస్‌ఎండీసీ ఆధ్వర్యంలో 23 ఇసుక క్వారీలకు టెండర్లు పిలిచింది. అందులో ఒక్కటి మినహా మిగతా 22 క్వారీలకు టెండర్లు పూర్తయ్యాయి. మానేరు నదిపై 18, హుస్సేన్‌మియావాగుపై 4 క్వారీలు నడువగా, వీటి గడువు గత డిసెంబర్‌ 31తో ముగిసింది. అయితే, ఇసుక తవ్వకాలపై మధ్యలో పలువురు గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో దాదాపు ఐదారు నెలల పాటు నిలిచిపోయాయి. తాజాగా గడువు ముగియడంతో కాంట్రా క్టు గడువును పొడిగించడం, లేక కొత్తగా టెండర్లు పిలవడంలో మైనింగ్​శాఖ జాప్యం చేస్తోంది. దీంతో ఆ 22 క్వారీలు బంద్‌ అయ్యాయి. అయితే చిన్నఓదాల, అడవిశ్రీరాంపూర్‌, ముత్తారం, ఓడేడ్‌, గోపాల్‌పూర్‌, అడవిసోమన్‌పల్లి స్టాక్‌ యార్డుల్లో భారీగా ఇసుక నిల్వలు ఉండడంతో తరలించేందుకు మాత్రం అనుమతులున్నాయి. దీంతో ఆ ఆరు చోట్ల నుంచి తరలింపు సాగుతుండగా, మరో మూడు నెలల్లో ఖాళీ కానున్నాయి.

నెల క్రితం వరకు ఇలా..

పెద్దపల్లి జిల్లాలోని ఇసుక క్వారీల్లో గృహ, ఇతర నిర్మాణాలకు సంబంధించి మూడు రకాల ఇసుక లభ్యమవుతున్నది. ఇండ్ల నిర్మాణాల మొదటి దశలో వాడే గల్ల ఇసుక (కోర్‌ సాండ్‌), నిర్మాణాల మధ్య లో వాడే కట్టుబడి ఇసుక, చివరి సమయంలో వాడే ఫైన్‌ సాండ్‌ దొరుకుతున్నది. కోర్‌ సాండ్‌ టన్నుకు 411, కట్టుబడి ఇసుకకు 1300, ఫైన్‌ సాండ్‌కు 1500 చొప్పున చెల్లించి బుక్‌ చేసుకునేది. అదనంగా ట్రాన్స్‌పోర్టు చార్జీలు భరించి ఈ ఇసుకను క్వారీల నుంచి 14 టైర్ల టిప్పర్లలో 32 టన్నులు, 16 టైర్ల టిప్పర్లలో 35 టన్నులను రవాణా చేసుకునేది. హైదరాబాద్‌తోపాటు 13 జిల్లాలకు ఇక్కడి నుంచి తీసుకెళ్లేది. నెల క్రితం వరకు పరిస్థితి బానే ఉన్నా.. ప్రస్తుతం అంతా మారిపోయింది.

అడ్డగోలు ధరలు..

గతంలో 22 క్వారీలు నడిచినప్పుడు ఒక్కో క్వారీకి రోజుకు 40 లారీల వరకు వచ్చేవి. అయితే అవి మూతపడగా, ఆరు స్టాక్‌ యార్డులకు డిమాండ్‌ పెరిగింది. దీంతో ఒక్కో చోటనే వందకుపైగా లారీలు క్యూ కడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇసుక ధరలు అమాంతం పెరిగాయి. నెల క్రితం వరకు 14 టైర్ల టిప్పర్‌లో 32 టన్నుల కోర్‌ సాండ్‌ కోసం 13,152 చెల్లించి బుక్‌ చేసుకునేది. హైదరాబాద్‌ తరలించేందుకు ఒక్కో ట్రిప్పునకు 40 వేలకుపైగా వినియోగదారుడికి ఖర్చయ్యేది. కానీ, ప్రస్తుతం 50 వేల నుంచి 60 వేల వరకు ఖర్చవుతున్నది. ప్రభుత్వానికి చెల్లించే మొత్తం మారకున్నా.. రవాణా, ఇతరత్రా ధరలు రెట్టింపయ్యాయి. ఇంతకుముందు ఇసుక బుక్‌ చేసేందుకు 200 నుంచి 300 వరకు తీసుకున్నా.. ప్రస్తుతం 1500 నుంచి 3వేల వరకు వసూలు చేస్తున్నారు. అలాగే, స్టాక్‌ యార్డు వద్ద రోజుకు 40 లోపు లారీల్లో లోడింగ్‌ చేస్తుండగా.. వందలాదిగా వస్తున్న లారీలు రెండు, మూడు రోజుల పాటు వేచి చూడాల్సి వస్తున్నది. దీంతో వెయిటింగ్‌ చార్జీలంటూ అదనంగా 7 వేల నుంచి 8 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ధరల పెంపుతో సామాన్యులు లబోదిబోమంటున్నారు.

ప్రభుత్వంపై విపక్షాల దాడి..

కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక ధరలు పెంచిందంటూ రాష్ట్రంలోని విపక్షాలు దాడిచేస్తున్నాయి. లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో పట్టణాల్లోని బీజేపీ, టీఆర్​ఎస్​ నేతలు ఇసుక ధరలు పెరగాన్ని తమ ప్రచార హస్తంగా మలుచుకుంటున్నాయి. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక ధరలను పెంచిందని, ఎన్నికలు అయిన తర్వాత అన్ని ధరలను పెంచుతారంటూ వారు ప్రజలకు వివరిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్​తో పాటు రంగారెడ్డి జిల్లాలో భారీ ఎత్తున నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇసుక ధరలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తమ స్వంతింటి కల కలగానే మారిపోతున్నాయి. ముఖ్యంగా ధరలు భారీగా పెరగడంతో ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయని షాద్​నగర్​ తాపీ మేస్త్రీ సంఘం ఉపాధ్యక్షుడు గౌడపూర కోటేశ్వర్​రావు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణాలు ఆగిపోవడంతో నిర్మాణ రంగ కార్మికులు, తాపీ మేస్త్రీలు పస్తులుంటున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఇసుక ధరలను నియంత్రించాలని ఆయన ధీనంగా కోరారు.

సీఎం దృష్టి సారించాలి..

ఇసుక ధరలు విపరీతంగా పెరగడానికి గల కారణాలపై సీఎం రేవంత్​రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రెన్యూవల్​ చేయని ఇసుక రీచ్​లను రెన్యూవల్​ చేయడమా?లేక కొత్తగా టెండర్లు పిలవడంపై చర్యలు తీసుకొని, ఇసుక ధరలను నియంత్రించాలంటూ సామాన్య, మధ్యతరగతి ప్రజలు సీఎంను ధీనంగా వేడుకుంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఇసుక ధరల నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే మరీ!

తుంగభద్ర నదీతీరంలో హద్దుల్లేకుండా తవ్వకాలు!

తెలంగాణ-ఏపీ సరిహద్దులో పారుతున్న తుంగభద్ర నదికి రెండు వైపులా ఉన్న ప్రాంతాల అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో యథేచ్ఛగా నది నుంచి ఇసుకను తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాఫియా తుంగభద్ర నదిలో రాత్రిళ్లు ఇసుకను తోడేస్తూ.. పగలు ఎత్తేస్తూ దర్జాగా దందా నిర్వహిస్తున్నది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ మండలం సింగవరం సమీపంలోని తుంగభద్ర నదికి సమీపంలో అవతలి వైపు ఏపీలోని పూడూరు, దేవమాడ, కోళ్ల బాంపురం గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ రెండు రాష్ర్టాల అధికారుల అలసత్వం కారణంగా తనిఖీలు తక్కువగా ఉంటున్నాయి. దీంతో ఇసుక మాఫియా ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. నదిలో ఉభయ రాష్ర్టాలకు సగం, సగం వాటా ఉన్నది. అయితే ఏపీలోని కర్నూల్‌ ప్రాంతానికి చెందినవారు ఆ రాష్ట్ర సరిహద్దులో ఉన్న వారి వాటాను తరలించుకుపోవడం పూర్తికాగా.. ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా తెలంగాణ వాటా ఇసుకను కూడా తోడేస్తున్నారు. మన ప్రాంతంలోకి వచ్చి ఇసుకను రాత్రికి రాత్రే తరలిస్తున్నారు. దేవమాడ, కోళ్ల బాంపురంతోపాటు నందికొట్కూర్‌ సమీపంలో రాత్రయితే చాలు నిత్యం 30 నుంచి 50 వరకు ట్రాక్టర్లతో ఇసుకను దోచుకెళ్తున్నారు. రాత్రి 10 దాటితే చాలు నదిలో ఇసుక దొంగలు విజృంభిస్తున్నారు. తెల్లవారుజాము 4, 5 గంటల వరకు నిరంతరాయంగా ఇసుక తరలిస్తున్నారు.

తగ్గిపోతున్న భూగర్భ జలాలు..

తుంగభద్ర నదిలో యథేచ్ఛగా ఇసుకను తోడేస్తుండడంతో తీర ప్రాంతంలో భూగర్భ జలాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ఇప్పటికే బోర్లలో నీటిమట్టం గణనీయంగా తగ్గిందని రైతులు వాపోతున్నారు. దీంతో రైతులు ఇసుక తరలింపుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నది నుంచి ఇసుక తరలించే ప్రాంతం సింగవరం గ్రామానికి 2 కిలోమీటర్లు.. అలంపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు 5 కిలోమీటర్ల దూరం ఉండటంతో పోలీసులు నిఘా ఉంచలేకపోతున్నారు. తరలింపునకు సంబంధించి ఏమైనా సమాచారం అందితే పోలీసులు అక్కడికి చేరుకునేలోపే ఇసుకాసురులు అక్కడి నుంచి జారుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఇసుక తరలిస్తుండటంతో వ్యాపారం ‘మూడు ట్రాక్టర్లు.. ఆరు ట్రిప్పులు’గా వర్ధిల్లుతున్నది.

ధ్వంసమవుతున్న రైతుల పైపులు..

తుంగభద్ర నదిలో నీటిని పంట పొలాలకు తరలించేందుకు పలు గ్రామాల రైతులు పొలాల వద్దకు పైపులు వేసుకున్నారు. అయితే రాత్రిళ్లు ఇసుక రవాణా సమయంలో ఇసుకలోని పైపులను సైతం ధ్వంసం చేస్తున్నారు. మరికొందరైతే బయటపడిన పైపులను ఎత్తుకెళ్తున్నారని రైతులు లబోదిబోమంటున్నారు. ఆరుగాలం కష్టపడి వేసిన పంటలకు సాగునీరు పారించేందుకు ఏర్పాటు చేసిన పైపులను తీసుకెళ్లడంతో తమకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదని వాపోతున్నారు. గతంలో ఇలా పైపులను ధ్వంసం చేసిన ఇసుకాసురులను సింగవరం రైతులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. అయినా వారితీరులో ఏమాత్రం మార్పు రాలేదు. ఈసారి ఇసుక తరలింపుతో నదిలో నీటి ప్రవాహం తగ్గిపోయిందని పలువురు రైతులు విచారం వ్యక్తంచేస్తున్నారు.

Spread the love

Related News

Latest News