వెల్లడించిన టీయూడబ్ల్యుజే- హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అధ్యక్షులు
ప్రతిపక్షం, వెబ్ డెస్క్: హౌసింగ్ సోసైటీలో సభ్యత్వం తీసుకోకపోతే ఇళ్ల స్థలాలు రావంటూ జరుగుతున్న ప్రచారాన్ని జర్నలిస్టులు నమ్మి మోసపోవద్దని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టియూడబ్ల్యుజె) హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల అధ్యక్షులు శిగ శంకర్, కొంపల్లి శ్రీకాంత్‌రెడ్డి, గడ్డమీది బాలరాజులు కోరారు. శుక్రవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలోని వివిధ నియోజకవర్గాలు,మండలాలలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను గందరగోళానికి గురిచేస్తూ కొందరు హౌసింగ్ సోసైటీ పేరుతో డబ్బులు వసుళు చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. హౌసింగ్ సోసైటీలో సభ్యులుగా నమోదు అయితేనే ఇళ్ళ స్థలాలు వస్తాయని జరుగుతున్న ప్రచారం అవాస్తమన్నారు. ఎవరూ కూడా ఇలాంటి హౌసింగ్ సోసైటీలకు డబ్బులు చెల్లించవద్దని వారు కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో స్పష్టమైన వైఖరిని వెల్లడించనున్నదన్నారు.
ఈ మేరకు మీడియా అకాడమీ ఆధ్వర్యంలో అన్ని వర్గాల జర్నలిస్టులతో చర్చలు జరిపి అర్హులైన జర్నలిస్టులందరికి తగిన న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. హౌసింగ్ సోసైటీల్లో ఉంటేనే ఇళ్ల స్థలాలు వస్తాయనడంలో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వ నియమనిబందనల మేరకే జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు కేటాయిస్తారే తప్ప హౌసింగ్ సోసైటీలో సభ్యులైనంత మాత్రాన అర్హులు కాదన్న విషయాన్ని విజ్ఞులైన విలేకరులు గుర్తించాలన్నారు. గతంలో కూడా ఇలాంటి సోసైటీల పేరుతో డబ్బులు వసూళ్లు చేసి పత్తాలేకుండా పోయిన వారు కూడా ఉన్నారన్న విషయాన్నివారు గుర్తు చేశారు. ఇప్పుడు కూడా గ్రేటర్ పరిధిలో హౌసింగ్ సోసైటీ పేరిట గత ఏడాది సభ్యత్వ నమోదు చేసి తాజాగా మరో మారు అదే విధమైన గందరగోళానికి తెరలేపారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి జర్నలిస్టు వద్ద నుంచి దరఖాస్తుకు రూ.50, సభ్యత్వ నమోదుకు వెయ్యి రూపాయాల చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. జర్నలిస్టులు ఎవరూ కూడా తొందరపడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నియమనిబందనలను వెల్లడించిన వెంటనే తమ సంఘం ఆధ్వర్యంలోనే జర్నలిస్టులతో చర్చించి అందరికి న్యాయం జరిగేలా చూస్తామని వారు తెలిపారు. అప్పటి వరకు ఎవరు కూడ నూతనంగా వస్తున్న వారికి డబ్బులు చెల్లించి సభ్యత్వాలను తీసుకోవద్దని శంకర్, శ్రీకాంత్‌రెడ్డి, బాలరాజులు కోరారు.