ప్రతిపక్షం, హైదరాబాద్: కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల తనిఖీకి ఏర్పాటైన నిపుణుల కమిటీ మరోసారి ఈ నెల 20న (రేపు)హైదరాబాద్ సందర్శిస్తుంది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన గల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటి (ఎన్డీఎస్) కమిటి ప్రాజెక్టు నిర్మాణం పనులు చేపట్టిన సంస్థలతో సమావేశమ వుతుంది.ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల మేరకు ఈ కమిటీ ఈ నెల 6 వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి, అధికారులతో సమీక్షించింది. ప్రాజెక్టుల కంట్రాక్ట్ సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఏజన్సీలు, అధికారులు హాజరయ్యేలా చూడాలని నిపుణుల కమిటి మెంబర్ సెక్రటరీ అమితాబ్ మీనా రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శికి వర్తమానం పంపారు. నిపుణుల కమిటీ పర్యటనకు అయ్యే వ్యయాన్ని బ్యారేజీలకు బాధ్యత వహించే నీటిపారుదల శాఖే భరించవలసి ఉంటుందని ఆయన సూచించారు.