Trending Now

కాంగ్రెస్​లో సీట్ల పంచాయితీ..

లోక్​సభ అభ్యర్థుల ఎంపికపై సీనియర్ల కుస్తీ

సీఎంకు మంత్రుల మధ్య పెరిగిన ఆఘాదం?

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో సీఎం, సీనియర్ల మధ్య విభేదాలు వచ్చాయా..? అంటే అవుననే సమాధానం గాంధీభవన్​ వర్గాల ద్వారి వినిపిస్తోంది. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​పార్టీ నేతలు మాత్రం కొట్లాడుకుంటునే ఉన్నారు. పైకి మాత్రం అంతా ఓకే అన్న చందంగా కనిపిస్తున్నా, లోపల మాత్రం నివ్వురుగప్పిన నిప్పులా అసమ్మతి కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. అప్పుడు సీఎం కుర్చీ కోసం సీనియర్లు హస్తిన బాట పట్టారు. అయితే ఆగ్రనేతలు మాత్రం అధికారంలోకి వచ్చేందుకు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్​రెడ్డి చేసిన కృషి, కాంగ్రెస్​పార్టీ శ్రేణుల్లో మాస్​ లీడర్​గా గుర్తింపు పొందిన విషయాన్ని ఆగ్ర నేతళు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా గుర్తించిన నేపథ్యంలో సీఎం కుర్చీలో ఆయనకు కూర్చొబెట్టారు. అయితే అప్పగి నుంచి కొంత మంది సీనియర్లకు అధిష్టానం ఆదేశంతో మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు మాట మాత్రం చెప్పడం లేదంటూ అంతర్గతంగా సీనియర్లు ధ్వజమెత్తుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి తన పేషీలో, అలాగే పలు సంస్థల్లో నామినెటెడ్​ పోస్టుల్లో నియమించిన సంఘటనలను సైతం అధష్టాన వర్గానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

గెలుపు వీరుల ఎంపికకు ఆఘాదం..

సీఎంగా పదవీబాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా లోక్​సభ ఎన్నికలు రావడం, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీ అత్యధిక స్థానాలను ఖైవసం చేసుకుని తన పదవిని పదిలం చేసుకునేందుకు సీఎం రేవంత్​రెడ్డి గెలుపు వీరుల ఎంపికకు కసరత్తు చేస్తున్నారు. ఏ ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? ప్రజల్లో వారి పట్ల ఉన్న మద్దతు తదితరాలపై సర్వే నిర్వహించినట్లు సమాచారం. దీంతో ఇతర పార్టీలలో ఉన్న నేతలను గుర్తించి వారిని పార్టీ కండువా కప్పి లోక్​సభ అభ్యర్థిగా ఎంపికకు సిద్ధం అయితే, సీనియర్లు కొంత మంది మోకాళ్లడుపెడుతున్నట్లు టీపీసీసీ నేతల్లో చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే నియోజకవర్గాలలో పార్టీల బలబలాలు, అభ్యర్థుల బలాబలాపై అంతర్గత సర్వే నిర్వహించి, సర్వేలో గెలుపు వీరులుగా ఉన్న వారికి టికెట్​ కోసం సిఫారస్సు చేసినట్లు సమచారం. దీనితో పాటు ఫలానా వారిని నిలబెడితే గెలుపు బాధ్యత సైతం తాను తీసుకుంటానంటూ అధిష్టానం పెద్దల వద్ద (ఎన్నికల కమిటీ) రేవంత్​ స్పష్టం చేసినట్లు సమాచారం. అయితే దీన్ని కొంత మంది సీనియర్లు వ్యతిరేకించడంతో పాటు తమ కుటుంబానికి చెందిన వ్యక్తికి, అలాగే తన మద్దతుదారుకు ఇస్తే తామే గెలుపు బాధ్యత తీసుకుంటామంటూ చెప్పినట్లు సమాచారం.

పైకి మాత్రం కూల్.. లోపల హీట్..

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ చాలా హ్యాపీగా ఉంది. లీడర్ల మధ్య తగాదాల్లేవు. సీనియర్లు-జూనియర్ల మధ్య బేధాభిప్రాయాలూ లేవు. అన్నట్లు బయటికి కనబడుతున్న లోపల మాత్రం హీట్​గానే కొనసాగుతోంది. బయటికి మాత్రం నేతలు కూల్​గానే కనిపిస్తున్నా లోపల మాత్రం నివురుగప్పిన నిప్పు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్లమెంట్‌ ఎన్నికలు సీఎం రేవంత్‌రెడ్డికి అతిపెద్ద సవాల్. ముఖ్యమంత్రి.. పైగా పీసీసీ చీఫ్‌ కూడా. వచ్చే ఐదేళ్లూ సీనియర్ల నుంచి ఎలాంటి ఆటంకాలు రాకుండా, మనశ్శాంతిగా సీఎం కుర్చీలో కూర్చోవాలంటే.. ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటాలి. ఇదీ రేవంత్‌రెడ్డి ముందున్న లక్ష్యం. 12 సీట్లు గెలిచి సత్తా చాటేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించుకొని ముందుకువెళ్తున్నారు. కలిసొస్తే 14 సీట్లూ గెలుచుకోవాలన్నదీ రేవంత్‌ టార్గెట్. అందుకే, చేరికలను ఒక గేట్​ తెరిచేశారు.

ఖమ్మంలో ముగ్గురు మంత్రుల మధ్య..

ఖమ్మం పార్లమెంట్ టిక్కెట్ కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పోటీ పడుతున్నారు. తన భార్య నందినికి ఖమ్మం టికెట్ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే తన కొడుకు యుగెందర్‌కు ఖమ్మం టికెట్ ఇప్పించేందుకు తుమ్మల నాగేశ్వరరావు ప్రయత్నిస్తున్నారు. ఇలా ఖమ్మం లోక్ సభ స్థానం టికెట్ కోసం ముగ్గురు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ముగ్గురిలో టికెట్ ఎవరికి ఇవ్వాలో ఏఐసీసీ తేల్చుకోలేకపోతుంది. ఈ క్రమంలోనే మంత్రుల మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతను ఏఐసీసీ ఇంచార్జ్ మున్షీకి అప్పగించింది. శుక్రవారం సాయంత్రం మున్షీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ముఖ్య నేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముగ్గు మంత్రుల మధ్య సయోధ్య కుదుర్చి అభ్యర్థి ఎంపికకు శ్రీకారం చుట్టబోతున్నారన్నది సమాచారం.

ఇదిలా ఉండగా భువనగిరి, నల్గొండ లోక్​సభ ఎన్నికల అభ్యర్థి ఎంపిక పై కూడా సీనియర్లు గురిపెట్టారు. నల్లగొండ నుంచి జానారెడ్డి కుమారుడికి టికెట్​ కోసం ప్రయత్నం జరుగుతుంది. ఇదిలా ఉంటే శాసనమండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి తన కుమారుడికి టికెట్​ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఆయన కుమారుడు సీఎం రేవంత్​రెడ్డి సలహాదారు వేం నరేందర్​రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే!. భువనగిరి టికెట్​ను కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి సతీమణి కోసం ప్రయత్నిస్తున్నారు. తన మరదలికి టికెట్​ ఇస్తే గెలుపించుకుంటానంటూ మంత్రి కోమటిరెడ్డి అధిష్టానవర్గం వద్ద అన్నట్లు సమాచారం. ఇక సికింద్రాబాద్‌ విషయంలోనూ అదే జరుగుతోంది. ఇక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలనే తర్జనభర్జన నడుస్తోంది. తాజాగా బీఆర్ఎస్‌ నుంచి వచ్చిన బొంతు రామ్మోహన్‌కు టికెట్‌ ఖాయమన్న ప్రచారం నడుస్తోంది. కానీ, ఈలోపే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

ప్రస్తుతం సికింద్రాబాద్‌ ఎంపీ రేసులో దానం నాగేందర్ పేరు కూడా వినిపిస్తోంది. దానంకు ఎంపీ టికెట్‌ ఇవ్వొద్దని కాంగ్రెస్‌లోనే ఓ వర్గం ఆందోళన చేస్తోంది. కానీ, గెలుపే లక్ష్యంగా ఆలోచిస్తున్న రేవంత్‌రెడ్డి మాత్రం దానంను ఎంపీ బరిలో దించాలనుకుంటున్నారని తెలుస్తోంది. అటు చేవెళ్లలోనూ అభ్యర్థి ఎంపిక సందిగ్ధంలో పడింది. చేవేళ్ల టికెట్​ ఆశించి పట్నం మహేందర్‌రెడ్డి ఫ్యామిలీ కాంగ్రెస్‌లో చేరింది. పట్నం సునీత మహేందర్‌రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్‌ ఖాయమన్నారు. చేవెళ్లలో జరిగిన జన జాతర సభలో సీఎం రేవంత్‌రెడ్డి వెనక కనిపించింది కూడా సునీతనే. కాని, ఆరోజు సభలో చేవెళ్ల ఎంపీ అభ్యర్ధిని ప్రకటించలేదు. బహుశా బీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి రాబోతున్నారని సమాచారం రేవంత్​కు ఉంది. ఇటీవల ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరారు.

రంజిత్‌రెడ్డికి చేవెళ్ల టికెట్‌ ఇవ్వడమా, లేక సునీతను చేవెళ్ల ఎంపీ అభ్యర్ధిగా నిలిపి, రంజిత్‌రెడ్డికే మల్కాజిగిరి టికెట్‌ ఇవ్వడమా అని సీఎం రేవంత్​ తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. అయితే ఎమ్మెల్సీ మహేందర్​రెడ్డి, రంజిత్​రెడ్డి వెటర్నరీ కాళాశాలలో క్లాస్​మెంట్లని, వారిద్దరి మద్య సీట్ల సర్దుబాటు జరిగిందంటున్నారు. అయితే సునీతా మహేందర్​రెడ్డిని మల్కాజిగిరి నుంచి బరిలోకి దింపాలని సీఎం నిర్ణయించారని, గురువారం మల్కాజిగిరి నియోజవర్గ పార్టీ శ్రేణుల సన్నాహాక సమావేశంలో ఆమె పాల్గొడంతో రూఢీ అయ్యింది. అయితే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి లాంటి సీనియర్లు ఉండగా.. వారికే అవకాశం ఇవ్వాలి గానీ, పక్క పార్టీ వాళ్లను చేర్చుకుని వారికి టికెట్ ఇవ్వడం ఏంటనేది డిప్యూటీ సీఎం ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం. అభ్యర్థుల ఎంపికలోపైచెయి సీఎందా? సీనియర్లదాఅన్న ప్రశ్నకు మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరీ!

Spread the love