ప్రతిపక్షం, జూన్ 09: అమెరికాలో ముగ్గురు స్నేహితుల ప్రాణాలను కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలను త్యాగం చేసిన తెలంగాణ యువకుడు కోడూరు అనురూప్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. కేవలం 23 ఏళ్ల వయసులోనే అసామాన్య ధైర్యసాహసాలు, మానవతా విలువలను చాటిన అనురూప్ చర్య అందరికీ ఆదర్శమని కొనియాడారు. లూసియానా రాష్ట్రంలోని టోరో బయూ పార్క్‌లో జరిగిన ఈ విషాద ఘటన రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరఫున అనురూప్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం కుటుంబానికి అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు కుటుంబాన్ని పరామర్శించి నివాళులు అర్పించారు.


























