బాలసాహిత్య పరిమళం.. ‘బంగారు లేడి’ గేయసంపుటి

ప్రతి పాఠశాల గ్రంథాలయంలో బాలసాహిత్య పుస్తకాలు ఉండాలి

బాలల సృజనాత్మక వికాసానికి గేయాలు దోహదం

గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్

ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట అక్టోబరు 21: బాలల్లో సృజనాత్మకతను పెంపొందించి, నైతిక విలువలను అలవర్చడంలో బాల సాహిత్యం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ అన్నారు. బాలసాహిత్య పుస్తకాలు ప్రతి పాఠశాల గ్రంథాలయంలో తప్పని సరిగా ఉండాలని సూచించారు. బాలలకు చదువుపై ఆసక్తిని పెంచి వారి ఊహాశక్తికి పదును పెట్టేలా బాలసాహిత్య రచనలు ఉండాలని పేర్కొన్నారు. సిద్ధిపేటలో బుధవారం నిర్వహించిన ‘ప్రతినెల మన బాలసాహిత్యం’ కార్యక్రమంలో కవి, గాయకుడు వరుకోలు లక్ష్మయ్య రచించిన ‘బంగారు లేడి’ బాలగేయ సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంతికృష్ణ మాట్లాడుతూ నేటి సమాజంలో బాల సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. బాలల మానసిక వికాసానికి, వ్యక్తిత్వ నిర్మాణానికి బాలసాహిత్యం దోహదపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బాలసాహిత్య సృజన విశేషంగా కొనసాగుతుండటం సంతోషకరమన్నారు. బాలలకు అర్థమయ్యే సరళమైన భాషలో, ఆసక్తికరమైన అంశాలతో రచనలు వెలువడితే వారిలో పఠనాసక్తి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

బాలల ఊహలకు రెక్కలు తొడిగే బాలగేయాలు

జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు ఎన్నవెళ్లి రాజమౌళి మాట్లాడుతూ బాలగేయాలు పిల్లలు సులభంగా నేర్చుకుని, ఆనందంగా పాడుకునేందుకు అనువుగా ఉంటాయన్నారు. గేయాలను పాడుతూ బాలలు సరికొత్త ఊహా ప్రపంచంలోకి ప్రయాణిస్తారని పేర్కొన్నారు. బాలసాహిత్య రచనలు నిరంతరం వెలువడి బాలల మనసులను వికసింపజేయాలని ఆకాంక్షించారు.
బాల సాహిత్య పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఉండ్రాళ్ళ రాజేశం మాట్లాడుతూ మాత్రా ఛందస్సుకు అనుగుణంగా రూపొందించిన బాల గేయాలు చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. వరుకోలు లక్ష్మయ్య రచించిన ‘బంగారు లేడి’ బాలగేయ సంపుటిలోని గేయాలు బాలలను ఆకట్టుకుని వారిలో సాహిత్యాభిరుచిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. బాలల హృదయాలకు చేరువయ్యే గేయ రచనలు సాహిత్య ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని పొందుతాయని చెప్పారు.

రచయితకు సన్మానం

అనంతరం ‘బంగారు లేడి’ బాల గేయ సంపుటి రచయిత వరుకోలు లక్ష్మయ్యను సాహితీవేత్తలు సత్కరించారు. బాలల కోసం గేయాలను రచిస్తూ బాలసాహిత్య అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాల సాహిత్య రచయితలు పెందోట వెంకటేశ్వర్లు, డబ్బికార్ సురేందర్, బస్వరాజు కుమార్, కాల్వ రాజయ్య, మళ్ళముల కనకయ్య, అనిశెట్టి సతీశ్ కుమార్, డాక్టర్ బి.సుధాకర్, మిట్టపల్లి పరశురాములు, ఉప్పరి బాలచంద్రం, ఎడ్ల లక్ష్మీభూంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News