*డైట్ లో వ్యాసరచన, క్విజ్ పోటీలను పరిశీలించిన కలెక్టర్ .
*18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి.
*చదువుతో పాటు ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి.
*నల్గొండ. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్.
ప్రతి పక్షం నల్గొండ నవంబర్ 18 : ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల విధానం, ఓటు హక్కు, ఓటు ప్రాముఖ్యత తదితర అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.
బుధవారం నల్లగొండ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) లో ఎన్నికల ప్రక్రియపై అవగాహన నిమిత్తం విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, క్విజ్ పోటీలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ పోటీలలో భాగంగా మండల, జిల్లా స్థాయిలలో నిర్వహించిన పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు మరింత ఉత్సాహంతో రాష్ట్రస్థాయిలో పాల్గొని అవార్డులు సాధించాలని చెప్పారు.భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారా పాలన కొనసాగుతుందని, ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఎన్నికల ప్రక్రియలో ఓటరు నమోదు, నామినేషన్ల దాఖలు, ఎన్నికల ప్రచారం, పోలింగ్ వంటి వివిధ దశలు ఉంటాయని, బ్యాలెట్ పేపర్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) ద్వారా ఎన్నికలు నిర్వహించే విధానం, ఈవీఎంల పనితీరు, వాటి రూపకల్పన, భద్రతా విధానాలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి వివరించారు. బ్యాలెట్ పేపర్ తో పోలిస్తే ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపు వేగంగా పూర్తవుతుందని తెలిపారు. దేశ ఎన్నికల విధానాన్ని పరిశీలించేందుకు ఇటీవల 18 దేశాల ప్రతినిధులు వచ్చి ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన విషయాన్ని ప్రస్తావించారు.విద్యార్థులు చదువుతోపాటు, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం, ఎన్నికల వ్యవస్థపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రిన్సిపల్ కె. నరసింహ తదితరులు ఉన్నారు.






























