జ్ఞానేశ్ కుమార్ను ఎన్నికల కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించాలి: సీపీఎం డిమాండ్
ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 11: ఢిల్లీలో ఎస్ఐఆర్ (SIR)కు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన వారిని అడ్డుకోవడం, నిరసనకారులను, సీపీఎం నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎం. అడివయ్య అన్నారు. ఈ చర్యలకు నిరసనగా మెదక్లో అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా ఎం. అడివయ్య మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు లేకుండా చేయాలని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. అందులో భాగంగానే ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికల కమిషన్ను కేంద్ర ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుందని ఆరోపించారు. నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శనివారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట శాంతియుత ధర్నాకు పిలుపునివ్వగా, వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే రైళ్లను, మెట్రో స్టేషన్లను మూసివేసి, ప్రతిపక్ష పార్టీల నాయకులను వారి నివాసాల వద్దే అరెస్టు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన నిరంకుశ వైఖరిని చాటుకుందని అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో చిన్నచిన్న కారణాలను చూపుతూ మైనారిటీలు, ప్రజాస్వామ్యంపై అవగాహన కలిగిన మేధావుల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన ఈ చర్యలను తక్షణమే నిలిపివేయాలని, ఎస్ఐఆర్ను రద్దు చేయాలని, జ్ఞానేశ్ కుమార్ను ప్రధాన ఎన్నికల కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే గ్రామస్థాయి నుంచి ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మెదక్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ. మల్లేశం, కె. మల్లేశం, వెంకట్, దుర్గ యాదగిరి, షౌకత్, లచ్చగౌడ్ తదితరులు పాల్గొన్నారు.





























