ప్రతిపక్షం, జూలై 22: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడు తప్పనిసరిగా ఎస్ఐఆర్ (SIR) ఫారం నింపి తన ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కొడంగల్లో తన ఎన్యూమరేషన్ ఫారాన్ని అధికారులకు అందజేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనదని పేర్కొన్నారు. “ఓటు లేని మనిషి చనిపోయిన వారితో సమానం. ఓటు పోతే సర్వం పోయినట్టే. ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకునేందుకు అవసరమైన వివరాలు సమర్పించాలి” అని సూచించారు.
ఓటరు జాబితా సవరణ పేరుతో కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరు పార్టీలు అయినప్పటికీ, తమ ప్రభుత్వాన్ని బలహీనపర్చడమే వారి ఉమ్మడి లక్ష్యమని విమర్శించారు.
ప్రజా సమస్యలపై తాము ప్రశ్నిస్తున్నందుకే రాజకీయ ప్రత్యర్థులు తనపై కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు కీలకమని ఆయన పునరుద్ఘాటించారు.

















