పౌరసత్వంపై కేంద్రంపై ఒవైసీ విమర్శలు

ప్రతిపక్షం, జూన్ 26: పౌరసత్వాన్ని నిరూపించడానికి పాస్‌పోర్టు ఒక్కటే ఆధారం కాదని కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలపై మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. పౌరసత్వ అంశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన విమర్శలు గుప్పించారు.

పోలీసుల ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే భారతీయులకు పాస్‌పోర్టు జారీ చేస్తారని ఒవైసీ పేర్కొన్నారు. భారత పౌరుడు కాకపోతే పాస్‌పోర్టు పొందే అవకాశం ఉండదని అన్నారు. తాను పుట్టుకతోనే భారతీయుడినని, పౌరసత్వాన్ని అనుమానించే పరిస్థితులు సృష్టించడం సరైంది కాదని వ్యాఖ్యానించారు.

భవిష్యత్తులో ఒక నిర్దిష్ట రాజకీయ పార్టీ సభ్యత్వం ఉన్న వారినే భారత పౌరులుగా గుర్తిస్తామని కేంద్రం చెప్పే పరిస్థితి వస్తుందేమోనని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పౌరసత్వం వంటి కీలక అంశంలో ప్రజలపై ప్రభుత్వ నియంత్రణ పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రతి పౌరుడికీ సమానంగా వర్తిస్తాయని, పౌరసత్వ అంశంలో అనవసర సందిగ్ధతకు తావివ్వకుండా కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు రావాలని ఒవైసీ కోరారు.

Spread the love

Related News

Latest News