ప్రతిపక్షం, జూన్ 26: కర్ణాటకలోని హోస్పేట్ వద్ద తుంగభద్ర ప్రాజెక్టుకు కొత్తగా ఏర్పాటు చేసిన 33 గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజోలిబండ మళ్లింపు పథకానికి కేటాయించిన పూర్తి నీటి వాటాను అందించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. తెలంగాణకు కేటాయించిన దాదాపు 15.9 టీఎంసీల నీటిలో ప్రస్తుతం ఐదు టీఎంసీలకు మించి అందడం లేదని, మిగిలిన నీరు అందక గద్వాల్, అలంపూర్, పాలమూరు ప్రాంతాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
తుంగభద్రలో మట్టి పేరుకుపోవడం, నీటి ప్రవాహానికి ఉన్న అవరోధాల కారణంగా కేటాయించిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం మూడు రాష్ట్రాలు కలిసి చర్చలు జరపడం చారిత్రాత్మక పరిణామమని పేర్కొన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆహ్వానం మేరకు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తాను ఒకే వేదికపై సమావేశమై సమస్యల పరిష్కారంపై చర్చించినట్లు తెలిపారు.
మూడు రాష్ట్రాల మధ్య సాగునీటి సమస్యలకు కేంద్ర ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతుందనే నమ్మకం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి, రైతుల పొలాలకు చేరాల్సిన నీరు సముద్రంలో కలిసిపోకుండా సమర్థవంతమైన ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మూడు తరాలుగా కొనసాగుతున్న నీటి సమస్యల పరిష్కారంలో కొత్తగా ఏర్పాటు చేసిన 33 గేట్లు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
బళ్లారి, అనంతపురం, కర్నూలు, పాలమూరు జిల్లాల లక్షలాది మంది రైతులకు ఈ గేట్ల పునరుద్ధరణ ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా మూడు రాష్ట్రాలు కలిసి చర్చలు జరపడం అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి కొత్త దిశగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తుంగభద్ర ఆనకట్ట నిర్మాణానికి మైసూరు మహారాజు, హైదరాబాద్ నిజాం కలిసి సహకరించిన చరిత్రను గుర్తు చేసిన రేవంత్ రెడ్డి, అదే స్ఫూర్తితో ప్రజాప్రతినిధులు కూడా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణతో పాటు మూడు రాష్ట్రాల నీటి సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని, రైతులకు న్యాయం జరిగేలా కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు.



















