Trending Now

రాష్ట్రంలో హిటేక్కిన రాజకీయం..

లోక్​సభ ఎన్నికల ప్రచారం షురూ..!

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికలు ముందే కూశాయి. మూడు ప్రధాన పార్టీలు మంగళవారం ఒకే రోజు మూడు ప్రాంతాల్లో భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహించడంతో తెలంగాణ పాలిటిక్స్​లో కాక రేపనున్నాయి. మంగళవారం నాడు రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కబోతోంది. ఒకేరోజు రంగంలోకి బీజేపీ ఆగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గులాబిదళపతి మాజీ సీఎం కె. చంద్రశేఖర్​రావు దిగనున్నారు. మంగళవారం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటా పోటీ సభలు నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ ప్రకటించకముందే తెలంగాణాలో మాత్రం ఎన్నికల శంఖారావాన్ని పార్టీలు పూరిస్తున్నాయి.

పరేడ్ గ్రౌండ్‌లో రేవంత్​రెడ్డి లక్ష మహిళా సంఘాల సభ్యులతో మహిళా శక్తి సభ నిర్వహించతలపెట్టారు. ఈ సభ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ ముందే పలు వర్గాలకు చెందిన వారి సంక్షేమం, అభివృద్ధి పథకాలను రేవంత్ లాంచ్ చేస్తున్నారు. దీనితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఆకర్శింపచేసేందుకు ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి బాగోగులను విని, అందుకు పరిష్కారంగా ముందుకు సాగనున్నారు. గతంలో ఉద్యోగులకు పెండింగ్​ డీఏలు, ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ చేయడంతో లోక్​సభ ఎన్నికల్లో గంపగుత్తగా ఉద్యోగుల ఓట్లు కాంగ్రెస్​కే పోలవుతాయంటున్నారు రాజకీయ పరిశీలకులు, అలాగే కరీంనగర్‌లో బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్​రావు కదన భేరి బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాళేశ్వరంపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టి ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేలా కేసీఆర్ ప్రసంగించనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘పోలింగ్​ బూత్​ సమ్మేళన్​’ సభలో పాల్గొననున్నారు. ఒకే రోజు మూడు పార్టీలు పొటాపోటిగా సభలు నిర్వహించడంతో రాష్ట్రంలో లోక్​సభ ఎన్నికల వేడి ప్రారంభమైంది.

Spread the love