ప్రతిపక్షం, అమరావతి: తాను రాజీకీయాలను విరమించుకుంటున్నట్లు వైసీపీ ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. ‘ఐనా మా కుటుంబం రాజకీయాల్లో కొనసాగుతుంది. నా బదులు మా అబ్బాయి రాఘవరెడ్డి ఎన్నికల బరిలో ఉంటాడు. అందుకోసం త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరతాడు’అని ప్రకటించారు. కాంగ్రెస్ తో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం మీదుగా వైఎస్సార్ కాంగ్రెస్ కు చేరి, మళ్లీ టీడీపీ వైపు మళ్లుతోంది. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల రాజకీయాల్లో మాగుంట కుటుంబం ప్రాధాన్యం గురించి తెలిసిందే. ఆయన అన్న సుబ్బరామిరెడ్డి కాంగ్రెస్ తరఫున లోక్ సభకు వెళ్లారు. 1990 దశకం ప్రథమార్థంలో తిరుపతిలో ఆ పార్టీ ప్లీనరీకి ఆయన ఆధ్వర్యమే ప్రధానమంటారు. ఆయన అకాల మరుణం(హత్య)తో ఆయన అర్థాంగి పార్వతమ్మ లోక్ సభకు, అటు తర్వాత ఉమ్మడి ఏపీ శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. అన్నగారి వారసత్వంతో శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు నుంచే కాంగ్రెస్ తరఫున లోక్ సభకు వెళ్లారు. అటు తరువాత టీడీపీలో చేరి విభజిత ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. గత (2019) లోక్ సభ ఎవైసీపీ తరపున నెగ్గారు. ఈసారి పోటీకి వైసీపీ అయన అభ్యర్థిత్వాన్ని పట్టించుకోకపోవడంతో మళ్లీ ‘సైకిల్’ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఎవరెలా మారితే ఏం..? పార్టీ శ్రేణులే మాత్రం వెంట ఉంటే చాలు.