నిరుపయోగంగా నీటి తొట్టిలు
నిర్వహణను గాలికొదిలిన అధికారులు
ప్రతిపక్షం, రామగిరి(మంథని), ఏప్రిల్ 20 : వేసవిలో మూగజీవాలు నీటి కోసం తండ్లాడుతున్నాయి. ప్రభుత్వం జాతీయ ఉపాధిహామీ చట్టంలో జీవాల దాహార్తి తీర్చడానికి గ్రామాల్లో నీటి తొట్టెలు నిర్మించింది. సంబంధిత అధికారులు వీటి నిర్వహణ గాలికొదిలేయడంతో మూగజీవాలు తాగునీటి కోసం తండ్లాడుతున్నాయి. కొన్ని చోట్ల నీటితొట్లు శిథిలావస్థకు చేరగా, మరికొన్నినిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయి. దాంతో జీవాల దాహార్తి తీర్చడానికి జనం అవస్థలు పడుతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో మొత్తం 17 గ్రామపంచాయతీల్లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 2019 వరకు పల్లెల్లో మూగజీవాల సంఖ్యకు అనుగుణంగా నీటి తొట్లు నిర్మించారు. మండలంలో రామయ్యపల్లి, ఆదివారం పేట, రాజాపూర్, లద్నాపూర్, ముస్త్యాల, చందనపూర్ తదితర గ్రామాల్లో నీటి తొట్టెలు నిరుపయోగంగా మారి చెత్త, చెదారం చేరి పిచ్చి మొక్కలతో శిథిలావస్థకు చేరాయి. దాంతో పశువుల దాహార్తి తీర్చడానికి బోరుబావులు, చెరువుల్లోకి తీసుకెళ్లి నీటిని తాగిస్తున్నారు.
గ్రామాల్లో వాగులు, వంకలు, కుంటలు పూర్తిగా ఎండిపోయాయి. పశువులు తాగేందుకు నీరు లేక ఇబ్బందులు పడుతు నీరు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి దాహం తీర్చుకుంటున్నాయి. గ్రామాల్లో ఉన్న నీటి తొట్టెలు మరమ్మతులకు నోచుకోకపోవడంతో వేసవికాలంలో పశువులు దాహార్తితో అలమటిస్తున్నయి. గ్రామాల్లో నిర్మించిన పశువుల నీటి తొట్టెలు నిరుపయోగంగా మారడంతో రైతులు పశువుల దాహార్తి తీర్చుకోవడం కోసం దూరంగా ఉన్న చెరువులు, వ్యవసాయ బోరుబావుల వద్దకు తీసుకెళ్లి తాగిస్తున్నారు. ఎండలు తీవ్రమైతే నీటి కొరతతో మరింతగా ఇబ్బందులు పడాల్సి ఉంటుందనీ, ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి తొట్టేలను మరమత్తులు చేసి వినియోగంలోకి తీసుకరావాలని రైతులు కోరుతున్నారు.