Trending Now

అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్​ వరుస సమీక్షలు..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: రాష్ట్రంలో మిగిలిన ఎనిమిది లోక్‌సభ స్థానాలకు సంబంధించి ఈనెల 27న అభ్యర్థులను కాంగ్రెస్‌ ప్రకటించే అవకాశం ఉంది. గెలుపు వీరుల ఎంపిక కోసం టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి వరుస సమీక్షలు చేస్తున్నారు. నాయకుల్లో ఏకాభిప్రాయాన్ని తీసుకువచ్చేందుకు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ దీపాదాస్ మున్షి కూడా ప్రయత్నిస్తున్నారు. బుధవారం జరిగే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో ఇంకా అభ్యర్థులు ఖరారుకాని లోక్‌సభ స్థానాలపై కాంగ్రెస్‌ కసరత్తు ముమ్మరం చేసింది. 17 ఎంపీ నియోజకవర్గాలకు గాను ఇప్పటికే రెండు విడతల్లో 9 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది.

మరో ఎనిమిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆయా నియోజకవర్గాల నాయకుల్లో ఏకాభిప్రాయం తెచ్చేందుకు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ దీపాదాస్‌ మున్షి, ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మిగతా ముఖ్యనేతలు ప్రయత్నిస్తున్నారు. భువనగిరి, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం నియోజకవర్గాలకు అభ్యర్థుల వేట కొనసాగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసినప్పటికీ స్థానిక నాయకత్వం నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క సూచించిన వారికే ఆదిలాబాద్ టికెట్ ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ నియోజకవర్గానికి సుప్రీంకోర్టు న్యాయవాది షహనాజ్‌ను ప్రకటిస్తారని భావించినా ఎటూ తేలలేదని తెలుస్తోంది. హైదరాబాద్, ఆదిలాబాద్ అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారని సమాచారం.

చామలపై కోమటిరెడ్డి బ్రదర్స్​ వ్యతిరేకత..

భువనగిరి నుంచి చామల కిరణ్‌రెడ్డి అభ్యర్థిత్వంపై కోమటిరెడ్డి సోదరులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని సమాచారం. వరంగల్‌ టికెట్‌ కోసం దమ్మాటి సాంబయ్యతో పాటు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పసునూరి దయాకర్ పోటీ పడుతున్నారు. కరీంనగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆయనకంటే బలమైన అభ్యర్థి కోసం రాష్ట్ర నాయకత్వం అన్వేషిస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నప్పటికీ స్థానికంగా అభ్యంతరాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఆరెంజ్‌ ట్రావెల్స్ యజమాని సునీల్‌రెడ్డి పేరును కూడా అక్కడి నుంచి పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మెదక్ నుంచి నీలం మధు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఖమ్మం అభ్యర్థి ఎంపికపై రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ దీపా దాస్ మున్షి నాయకుల అభిప్రాయాలు సేకరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సోదరుడు ప్రసాద్‌ రెడ్డికి టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే సర్వేలు నిర్వహించిన సునీల్ కనుగోలు బృందం రాష్ట్ర నాయకత్వానికి నివేదిక అందించినట్లుగా తెలుస్తోంది. సర్వేలు, స్థానిక నేతల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈనెల 27న జరిగే కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తుది నిర్ణయానికి రానున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు..

రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాలు గెలవాలనే పట్టుదలతో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి ఆ దిశగా వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇప్పటికే మల్కాజ్‌గిరి లోక్‌సభ పరిధి నాయకులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన ఆదివారం మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ నేతలతో భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రజాపాలన సహా గ్యారంటీల అమలును ప్రజలకు చేరవేయాలన్నారు. నేతలంతా సమన్వయంతో పనిచేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవాలని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు.

Spread the love

Related News

Latest News