ప్రతిపక్షం, జూన్ 11: టీఆర్ఎస్ పేరును కేటాయించే అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ పేరును ఏ రాజకీయ పార్టీకి కూడా కేటాయించవద్దంటూ బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లు సమాచారం. టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటనలపై వందల సంఖ్యలో అభ్యంతరాలు నమోదైనట్లు తెలుస్తోంది.
మరోవైపు ‘తెలంగాణ రక్షణ సేన’ పేరుతో రాజకీయ కార్యకలాపాలు చేపడుతున్న వర్గం కూడా ఈ పేరుపై తమ హక్కును వినిపించేందుకు ఎన్నికల సంఘాన్ని కలవనున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ పేరుకు తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉండటంతో దీనిపై వివాదం మరింత ముదురుతోంది.
ఇక మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన’ కూడా టీఆర్ఎస్ పేరును తమకు కేటాయించాలని ఎన్నికల సంఘానికి వినతి చేసినట్లు తెలుస్తోంది. ఒకే పేరుపై పలువురు హక్కు కోరుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు కీలకంగా నిలిచిన టీఆర్ఎస్ పేరు చుట్టూ నెలకొన్న ఈ వివాదం రానున్న రోజుల్లో మరింత ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం కనిపిస్తోంది.














