సిద్ధిపేట కోమటి చెరువుతో పాటు పలు ప్రాంతాల్లో చిత్రీకరణ
తెలంగాణ నటీనటులకు ప్రాధాన్యం
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబరు 29: తెలంగాణ పల్లెటూరి జీవనశైలి, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల మనోభావాలను ప్రతిబింబించేలా డీసీ ఫిలిం పతాకంపై ‘ఒక ఊరు కథ’ పేరుతో నూతన చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు గురువారం నిర్వహించారు. సిద్ధిపేటలోని కోమటి చెరువు, ఇతర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు.ఈ సందర్భంగా చిత్రబృందం సభ్యులు మాట్లాడుతూ.. తెలంగాణ గ్రామీణ వాతావరణం, పల్లె ప్రజల జీవన విధానం, వారి భావోద్వేగాల నేపథ్యంలో కథ సాగుతుందని తెలిపారు. సహజత్వానికి దగ్గరగా, ప్రతి ఒక్కరికీ నచ్చేలా వినోదాత్మకంగా చిత్రాన్ని రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఈ చిత్రానికి నిర్మాతగా, దర్శకుడిగా దేవేందర్ చందాపురం వ్యవహరిస్తున్నారు. సహదర్శకుడిగా శివ, ఛాయాగ్రాహకుడిగా యోగి, సహాయ ఛాయాగ్రాహకుడిగా పురుషోత్తం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథకు తగిన నటీనటులను ఎంపిక చేసి, గ్రామీణ జీవనశైలికి అద్దం పట్టేలా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్రబృందం పేర్కొంది.
రఘు కథానాయకుడిగా.. భవాని కథానాయికగా
ఈ చిత్రంలో రఘు కథానాయకుడిగా, భవాని కథానాయికగా నటిస్తున్నారు. గౌతమి, దీపికతో పాటు పలువురు నటీనటులు వివిధ పాత్రల్లో కనిపించనున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కళాకారులకు ప్రాధాన్యమిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు దర్శకుడు దేవేందర్ చందాపురం తెలిపారు.
సిద్ధిపేట కళాకారులకు కీలక పాత్రలు
సిద్ధిపేట జిల్లా చలనచిత్ర, టెలివిజన్ కళాకారుల సంఘం(ఎస్డీఎఫ్టీఏఏ) ఆధ్వర్యంలో పలువురు కళాకారులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి డాకూరి భాస్కర్ రెడ్డి పోలీసు ఇన్స్పెక్టర్ పాత్రలో, ఉపాధ్యక్షుడు ఎర్రమరాజు చరణ్ రాజు(ఏసీఆర్) గ్రామ సర్పంచ్ పాత్రలో కనిపించనున్నారు. సీనియర్ నటుడు గౌట్ రాజు, కరట బాలు, ఉపాధ్యక్షుడు స్వామి శరణం, కోశాధికారి నెమలి సుభాష్‌తో పాటు రాణి, కీర్తి, మంజుల, మోజేశ్, రాకేశ్, మహేందర్ తదితరులు వివిధ పాత్రల్లో నటించనున్నారు.వీరితో పాటు సిద్ధిపేట జిల్లాకు చెందిన మరో పది మంది కళాకారులు, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలకు చెందిన మరో పది మంది కళాకారులు ఇతర పాత్రల్లో ప్రేక్షకులను అలరించనున్నారు.
గ్రామీణ వినోదానికి ప్రాధాన్యం
తెలంగాణ పల్లె అందాలు, స్థానిక సంస్కృతి, ప్రజల జీవన విధానాలను తెరపై సహజంగా ఆవిష్కరించడమే లక్ష్యంగా ‘ఒక ఊరు కథ’ చిత్రాన్ని రూపొందిస్తున్నామని నిర్మాత, దర్శకుడు దేవేందర్ చందాపురం తెలిపారు. త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు వెల్లడించారు.గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మంచి విజయం సాధించి, ఇందులో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ మంచి గుర్తింపు తీసుకురావాలని పలువురు ఆకాంక్షించారు.





























