[t4b-ticker]

వర్షాల హెచ్చరిక.. తెలంగాణ, ఏపీలో పలు జిల్లాలకు అలర్ట్

ప్రతిపక్షం, జూలై 29: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నేడు పలుచోట్ల భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖలు వెల్లడించాయి.

తెలంగాణలోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు, పోలవరం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే శ్రీకాకుళం, మన్యం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

వర్షాల సమయంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, పిడుగులు పడే సమయంలో చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. రైతులు కూడా వాతావరణ సూచనలను అనుసరించి వ్యవసాయ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love

Related News

Latest News