[t4b-ticker]

అంగన్‌వాడీల బలోపేతానికి సీతక్క కీలక ఆదేశాలు.. జిల్లాల వారీగా సదస్సులు

ప్రతిపక్షం, జూలై 30, హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్‌వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. మహిళా, శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల వారీగా అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలతో ప్రత్యేక సదస్సులు నిర్వహించి, వారి సమస్యలు, సూచనలు నేరుగా తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల లోటును వెంటనే గుర్తించి పరిష్కరించాలని మంత్రి స్పష్టం చేశారు. అలాగే టీచర్లు, ఆయాలకు అందించే యూనిఫాంలను అక్టోబర్ తొలి వారంలోపు పంపిణీ చేయాలని అధికారులకు గడువు విధించారు.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో దత్తత (అడాప్షన్) కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17 అడాప్షన్ కేంద్రాలు పనిచేస్తున్నాయని అధికారులు వివరించగా, మిగిలిన జిల్లాల్లో కూడా త్వరితగతిన ఏర్పాటు చేయాలని సూచించారు.

అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల ఖాళీల భర్తీని వేగంగా పూర్తి చేయాలని, ఇప్పటికే 16 జిల్లాల్లో నోటిఫికేషన్లు జారీ చేసిన నేపథ్యంలో మిగిలిన జిల్లాల్లో కలెక్టర్లతో సమన్వయం చేసుకుని నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందుతున్న పోషకాహారం, వారి ఎదుగుదలపై ప్రత్యేక శాంపిల్ సర్వే నిర్వహించాలని, ఆ నివేదిక ఆధారంగా పోషకాహార కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని మంత్రి సూచించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు వృథా కాకుండా ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి రూపాయిని సమర్థంగా వినియోగించాలని అధికారులను ఆదేశించారు.

మహిళలు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న మంత్రి సీతక్క, అంగన్‌వాడీ వ్యవస్థను రాష్ట్రంలో మరింత బలోపేతం చేసేందుకు అన్ని స్థాయిల్లో సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.

Spread the love

Related News

Latest News