*తెలంగాణ పోరాట స్ఫూర్తికి ప్రతీక సెప్టెంబర్ 17 – నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి దినం .
*ఆనాటి త్యాగాల స్ఫూర్తితోనే నేడు ప్రజా పాలన దినోత్సవ వేడుకలు .
*ప్రతి పౌరుడికి సంక్షేమ ఫలాలు అందడమే నిజమైన ప్రజా పాలన.
*అధికారులు ప్రజలకు మరింత చేరువై, పారదర్శకంగా, జవాబుదారీతనంతో పని చేయాలి.
*జాతీయ జెండా ఆవిష్కరించిన ఆర్డీఓ వందనపు శ్రీదేవి.
ప్రతి పక్షం చండూరు సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం వేడుకలు చండూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర చరిత్రలో సెప్టెంబర్ 17కు ఉన్న విశిష్టతను చాటుతూ ఈ వేడుకలు నిర్వహించారు. ఆర్డీఓ వందనపు శ్రీదేవి గారు జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ వందనపు శ్రీదేవి గారు మాట్లాడుతూ… సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల తెగువకు, పోరాట స్ఫూర్తికి నిదర్శనమని అన్నారు.నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రజలను విముక్తి చేయడానికి ఎంతో మంది వీరులు ప్రాణ త్యాగాలు చేశారని, రైతులు, ప్రజలు, విద్యార్థులు రజాకార్లకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారని గుర్తు చేశారు.
ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలోనే సువర్ణ అధ్యాయమని, ఆ పోరాట ఫలితంగానే 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమై ప్రజలకు నిజమైన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం సిద్ధించిందని పేర్కొన్నారు.
ఆనాటి త్యాగాల స్ఫూర్తితోనే నేడు ప్రజా పాలన దిశగా ప్రభుత్వం పని చేస్తోందని, ప్రతి పౌరుడికి సంక్షేమ ఫలాలు అందడమే నిజమైన ప్రజా పాలన అని అన్నారు.అధికారులు ప్రజలకు మరింత చేరువై, పారదర్శకంగా, జవాబుదారీతనంతో పని చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చండూరు తాహసీల్ధార్ రమావత్ కాంత్ శర్మ గారు, మున్సిపల్ కమీషనర్ ఎల్. మల్లేశం గారు, మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు గారు, మున్సిపల్ కౌన్సిలర్లు, చండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి గారు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.































