*మున్సిపల్ కార్యాలయంలో మూలన పడేసిన విగ్రహం – ముసుగు తొలగించి నివాళులర్పించిన బీజేపీ నాయకులు.
*తెలంగాణ తల్లికి అవమానం జరగకూడదు -BRS పెట్టి మరిచింది – కాంగ్రెస్ తొలగించి మూలన పడేసింది .
*తెలంగాణ తల్లి ఆత్మగౌరవానికి ప్రతీక – గౌరవప్రదంగా పునఃప్రతిష్ఠించాలి – బీజేపీ డిమాండ్.
ప్రతి పక్షం చండూరు సెప్టెంబర్ 17: చండూరు మున్సిపాలిటీ పరిధిలోని గుండ్రపల్లి రోడ్డులో గత BRS ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించకుండా ముసుగు కప్పి ఉంచారని, తాజా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో విగ్రహాన్ని పూర్తిగా తొలగించి మున్సిపల్ కార్యాలయంలో గోడకు ఆనించి మళ్లీ ముసుగు కప్పి అవమానించారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ విమోచన దినోత్సవం (ప్రజా పాలన దినోత్సవం) సందర్భంగా తెలంగాణ తల్లికి అవమానం జరగకూడదనే ఉద్దేశంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయంలో ఉన్న విగ్రహానికి ఉన్న ముసుగును తొలగించి, నీటితో శుభ్రంగా కడిగి, పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ… “తెలంగాణ తల్లి అంటే తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. ఆమెను గౌరవించడం ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యత. గత ప్రభుత్వం విగ్రహం పెట్టి ఆవిష్కరించలేదు, నేటి ప్రభుత్వం రోడ్డు విస్తరణ పేరుతో విగ్రహాన్ని తొలగించి మూలన పడేసింది. ఇది తెలంగాణ తల్లిని అవమానించడమే. వెంటనే విగ్రహాన్ని గౌరవప్రదమైన ప్రదేశంలో పునఃప్రతిష్ఠించాలి. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం” అని డిమాండ్ చేశారు.































