ప్రతిపక్షం, సెప్టెంబర్ 17: ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. భారత్-రష్యా మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో మోదీ వ్యక్తిగతంగా చేసిన కృషిని ఎంతగా చెప్పినా తక్కువేనని పుతిన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ వేదికపై మోదీకి ఉన్న ప్రాధాన్యతను కూడా తన సందేశంలో ప్రస్తావించారు.
ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారత్లో పర్యటించిన పుతిన్.. తనకు, రష్యా ప్రతినిధి బృందానికి అందించిన ఆతిథ్యానికి మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆ పర్యటనలో ఇరువురు నేతలు జరిపిన చర్చలు సారవంతంగా, స్పష్టంగా, ఫలప్రదంగా సాగాయని పుతిన్ పేర్కొన్నారు. ఎప్పటిలాగే మోదీతో జరిగిన చర్చల్లో ఆయన రాజకీయ దూరదృష్టి, ముందుచూపు స్పష్టంగా కనిపించిందని ప్రశంసించారు.
భారత్, రష్యా మధ్య ఇప్పటికే కొనసాగుతున్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరుదేశాలు కృషి కొనసాగిస్తున్నాయని పుతిన్ తెలిపారు. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాల్లో భారత్తో నిర్మాణాత్మక సహకారాన్ని భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని ఆయన తన సందేశంలో స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోదీ, పుతిన్ ప్రత్యేకంగా సమావేశమై ఇరుదేశాల సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. వాణిజ్యం, ఇంధనం, మౌలిక వసతులు, సాంకేతికత, రక్షణ, సంస్కృతి తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవడంపై ఇరువురు నేతలు చర్చించినట్లు అధికారిక వివరాలు వెల్లడించాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంచే లక్ష్యంపైనా చర్చలు జరిగినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో మోదీ పుట్టినరోజున పుతిన్ పంపిన సందేశం భారత్-రష్యా సంబంధాల్లో కొనసాగుతున్న ఉన్నతస్థాయి రాజకీయ సంప్రదింపులకు మరో ఉదాహరణగా నిలిచింది. అంతర్జాతీయ పరిణామాలు, ప్రాంతీయ సమస్యలు, ద్వైపాక్షిక సహకారంపై ఇరుదేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని పుతిన్ పేర్కొన్నారు.
మోదీకి పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రపంచ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్న నేపథ్యంలో పుతిన్ సందేశం ప్రత్యేకంగా నిలిచింది. భారత్-రష్యా మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంబంధాలను ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులోనూ ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగుతుందని రష్యా అధ్యక్షుడు తన సందేశంలో స్పష్టం చేశారు.





























