‘తెలంగాణ రక్షణ సేన’ పేరుకు గుర్తింపు ఇవ్వాలి.. కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత లేఖ

ప్రతిపక్షం, జూలై 13: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీకి అధికారిక గుర్తింపు కల్పించాలని కోరుతూ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ)కి లేఖ రాశారు. తమ పార్టీ పేరుపై వ్యక్తమైన అభ్యంతరాల వివరాలను వెల్లడించాలని కూడా ఆమె ఎన్నికల సంఘాన్ని కోరారు.

లేఖలో కవిత పలు అంశాలను ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ఇప్పటికే ఒకే విధమైన పేర్లు లేదా పోలికలు ఉన్న అనేక రాజకీయ పార్టీలకు గుర్తింపు ఇచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణలోనే తెలంగాణ రాజ్య సమితి, తెలంగాణ రక్షణ సమితి పేర్లతో రాజకీయ పార్టీలు నమోదై ఉన్నాయని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితుల్లో ‘తెలంగాణ రక్షణ సేన’ అనే పేరుపై మాత్రమే అభ్యంతరాలు వ్యక్తం చేయడం వెనుక కారణాలు ఏమిటో స్పష్టం చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

తమ పార్టీ పేరును తిరస్కరించేందుకు వచ్చిన అభ్యంతరాల స్వరూపం, వాటిని ఎవరు దాఖలు చేశారు, ఏ ప్రాతిపదికన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయనే పూర్తి వివరాలను అందించాలని కవిత లేఖలో విజ్ఞప్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రమాణాలు అమలు చేయాలని ఆమె కోరారు.

ఇటీవల ఈ అంశంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈ నెల 7న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి తన వివరణను సమర్పించినట్లు కవిత తెలిపారు. న్యాయపరమైన ప్రక్రియను అనుసరిస్తూ తమ పార్టీకి గుర్తింపు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు పేర్కొన్నారు.

తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీ నమోదు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ పేరుపై ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

Spread the love

Related News

Latest News