రైతు కళ్లలో ఆనందమే మా ప్రభుత్వానికి ఆశీర్వాదం: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 11: తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజుగా నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల కళ్లల్లో ఆనందాన్ని చూడడమే తమ ప్రభుత్వానికి నిజమైన ఆశీర్వాదమని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించిన భారీ రైతు ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం.. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా గత తొమ్మిది రోజులుగా రైతు భరోసా నిధుల పంపిణీ చేపట్టిన ప్రభుత్వం.. మొత్తం 73.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లకు పైగా జమ చేసినట్లు సీఎం వెల్లడించారు. సభా వేదిక నుంచే రైతు భరోసా చివరి విడత కింద 1.44 లక్షల మంది రైతులకు రూ.1,009.15 కోట్లను విడుదల చేశారు. అదే సమయంలో రైతులకు ఈ-పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా అధికారికంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వేలాది మంది రైతులు పాల్గొన్నారు.

రైతులను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం.. గత 30 నెలల్లో వ్యవసాయ రంగం కోసం ప్రభుత్వం రూ.1.70 లక్షల కోట్ల వ్యయాన్ని చేసినట్లు తెలిపారు. రైతు భరోసా, రుణమాఫీ, పంట బీమా, గిట్టుబాటు ధరలు, సన్న వడ్లకు బోనస్, ఉచిత విద్యుత్, ప్రకృతి విపత్తుల నష్టపరిహారం వంటి పథకాల ద్వారా రైతులకు అండగా నిలిచామని చెప్పారు. ప్రతి నెలా సగటున రూ.5,500 కోట్ల మేర రైతు సంక్షేమంపై ఖర్చు చేస్తున్నామని వివరించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు భరోసా కింద ఇప్పటికే రూ.36,135 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు సీఎం వెల్లడించారు. వ్యవసాయం దండగ కాదని, పండుగగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. “ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు” అనే పెద్దల మాటలను గుర్తు చేస్తూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యమని అన్నారు.

గత ప్రభుత్వం నుంచి రూ.8.11 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని స్వీకరించినప్పటికీ, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ పాత సంక్షేమ పథకాలను కొనసాగించడమే కాకుండా కొత్త పథకాలను కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి వంటి పథకాలను కొనసాగించడంతో పాటు రైతు భరోసా మొత్తాన్ని ఎకరానికి రూ.12 వేల వరకు పెంచినట్లు పేర్కొన్నారు. గత 30 నెలల్లో రూ.80 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.

ప్రభుత్వం రైతులతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, 7 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, మహిళా సంఘాలకు ఆర్థిక ప్రోత్సాహం, వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు వంటి పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. అదేవిధంగా ఇందిరమ్మ చీరల పంపిణీ, ఏడాదిలోపే 67,717 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి కార్యక్రమాలను కూడా ప్రస్తావించారు.

వచ్చే శాసనసభ ఎన్నికలు 2029 మే లేదా జూన్‌లో జరిగే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో రాష్ట్రంలో లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు, శాసనసభ స్థానాలు 119 నుంచి 182కు పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

తెలంగాణలో ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమని, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు, మహిళలు, రైతులు, విద్యార్థుల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ఈ సందర్భంగా మొక్కజొన్న రైతుల కోసం రూ.3,504 కోట్ల నిధుల విడుదలను ప్రకటించిన సీఎం.. పలువురు రైతులకు ఈ-పట్టాదారు పాసుపుస్తకాలను అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతుల అభ్యున్నతే తెలంగాణ అభివృద్ధికి పునాది అని, రైతు సంక్షేమంలో ఎలాంటి రాజీ ఉండదని మరోసారి స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News