ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల్లో జిల్లాకు అన్యాయం చేయొద్దు.

మెదక్ జిల్లాను ఎందుకు విస్మరించారు?: ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సోషల్ మీడియాలో వైరల్ నోటిఫికేషన్‌పై ఆందోళన.

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన మాజీ డిప్యూటీ స్పీకర్ యం.పద్మా దేవేందర్ రెడ్డి.

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూన్ 29: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎస్సై, కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్‌లో మెదక్ జిల్లాకు ఒక్క పోస్టు కూడా కేటాయించలేదన్న సమాచారంపై మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి స్పందించారు. మెదక్ జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో మాట్లాడారు. అక్కడ విద్యార్థులు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి వినతి అందజేశారు. వారి ఆందోళనను తెలుసుకుని జిల్లా కలెక్టర్‌ ప్రతిమ సింగ్ కు విద్యార్థులతో కలసి ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాల వారీగా రేషియో ప్రకారం పోలీస్ శాఖలోని ఖాళీలను భర్తీ చేసి మెదక్ జిల్లాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎస్సై, కానిస్టేబుల్ నియామక నోటిఫికేషన్‌లో మెదక్ జిల్లాకు ఒక్క పోస్టు కూడా లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నోటిఫికేషన్‌లో 5 వేల ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీని 31 జిల్లాలకు మాత్రమే కేటాయించారని, అందులో మెదక్ జిల్లా పేరు లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ నోటిఫికేషన్ అధికారికమా కాదా అన్న విషయాన్ని ప్రభుత్వం వెంటనే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో పోలీసు శాఖలో సుమారు 19 వేల ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగ క్యాలెండర్ విడుదల సమయంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ ఇప్పటి వరకు కనీసం 40 వేల పోస్టుల నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని విమర్శించారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రెండు విడతల్లో 19 వేల చొప్పున మొత్తం 38 వేల ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ఖాళీల ప్రకారం కనీసం 19 వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి, జిల్లాల వారీగా రేషియో ప్రకారం పోస్టులను కేటాయించాలని డిమాండ్ చేశారు.వైరల్ అవుతున్న జాబితాలో మెదక్ జిల్లాను పూర్తిగా విస్మరించడం అన్యాయమని, అధికారిక నోటిఫికేషన్ కూడా ఇదే విధంగా ఉంటే మెదక్ జిల్లా నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోతారని అన్నారు. మెదక్ జిల్లాపై ప్రభుత్వం చిన్నచూపు ఎందుకు చూపుతోందో సమాధానం చెప్పాలని, జిల్లాకు రావాల్సిన పోస్టులను వెంటనే కేటాయించి విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు ఏం లావణ్య రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి,పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు , కౌన్సిలర్లు జుబేర్ అహ్మద్ బట్టి ఉదయ్ కుమార్ దీపక్ కుమార్, మెదక్ హవెలిఘనపూర్,శంకరంపేట మండల పార్టీ అధ్యక్షులు ఎం అంజ గౌడ్ సిహెచ్.శ్రీనివాస్ రెడ్డి పట్లూరి రాజు,మాజీ కౌన్సిలర్లు మాయ మల్లేశం భీమరి కిషోర్, నాయకులు కొత్తపల్లి కిష్టయ్య ఇందాద్, గట్టేష్, కిరణ్, ఇస్మాయిల్, లక్ష్మణ్ మోహన్ నాయక్, ఎంబీపూర్ మహేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News