ప్రతిపక్షం, జూన్ 27: హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ విడతలో తెలంగాణలో 40.97 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే సుమారు 5 లక్షల మంది చిన్నారులు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి పొందనున్నట్లు అంచనా వేశారు.
పోలియో కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. నగరంలో జనసాంద్రత అధికంగా ఉండటంతో తొలి రోజు అనంతరం మరో రెండు రోజుల పాటు ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. అవసరమైతే ఈ కార్యక్రమాన్ని జులై 1 వరకు పొడిగించాలని రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు సూచించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

















