ప్రతిపక్షం, జూన్ 01: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నేటి నుంచి మళ్లీ నిషేధం విధించింది. మే నెలలో ప్రత్యేకంగా కల్పించిన బదిలీల అవకాశం గడువు ముగియడంతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, జూన్ 1 నుంచి వచ్చే ఆరు నెలల పాటు సాధారణ బదిలీలు చేపట్టరాదు. అలాగే బదిలీలకు సంబంధించిన ఎలాంటి మినహాయింపు ప్రతిపాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవద్దని అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపులు కొనసాగనున్నాయి. పదోన్నతులు పొందిన ఉద్యోగులు, దీర్ఘకాలిక సెలవుల అనంతరం విధుల్లో చేరే సిబ్బంది, అత్యవసర ఖాళీల భర్తీ వంటి సందర్భాల్లో మాత్రమే బదిలీలకు అనుమతి ఉంటుంది.
ఈ నిర్ణయంతో ప్రభుత్వ శాఖల్లో సాధారణ బదిలీల ప్రక్రియ మరో ఆరు నెలల పాటు నిలిచిపోనుండగా, పరిపాలనా అవసరాల మేరకు మాత్రమే పరిమిత మార్పులు జరిగే అవకాశం ఉంది.

















