ప్రతిపక్షం, జూలై 10: క్రీడల్లో ప్రతిభ కనబరిచే యువతకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. గచ్చీబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగో, వెబ్సైట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
క్రీడలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర క్రీడా విధానాన్ని అమలు చేస్తోందని సీఎం తెలిపారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు అత్యాధునిక సౌకర్యాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ విశ్వవిద్యాలయం ద్వారా నాణ్యమైన శిక్షణతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వివరించారు.
క్రికెట్లో అద్భుత ప్రతిభ కనబరిచిన భారత పేసర్ మహ్మద్ సిరాజ్కు విద్యార్హతలు లేకపోయినా అతని ప్రతిభను గుర్తించి డీఎస్పీ ఉద్యోగం కల్పించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ప్రతిభకు ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వంగా తెలంగాణ నిలుస్తుందని, భవిష్యత్తులో కూడా క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా భారత అథ్లెటిక్స్ దిగ్గజం, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష సేవలను సీఎం కొనియాడారు. ఆమె జీవిత ప్రయాణం, క్రీడా ప్రస్థానం ప్రతి విద్యార్థికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పీటీ ఉషను స్ఫూర్తిగా తీసుకుని క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తే అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించడం సాధ్యమేనని విద్యార్థులకు సూచించారు.
తెలంగాణను దేశంలోనే క్రీడల కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, యువ క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులు, అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని క్రీడా రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
















