ప్రతిపక్షం, జూలై 06: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభల నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టనుంది. ముఖ్యంగా సభా వేదికతో పాటు పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించింది. ఇంటెలిజెన్స్ శాఖ సూచనల మేరకు సభా వేదికపైకి అనుమతించే ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకుల సంఖ్యను కూడా పరిమితం చేయనున్నారు.
ఇకపై గతంలో మాదిరిగా అందరు నాయకులకు వేదికపైకి వెళ్లేందుకు అనుమతి ఉండదని అధికార వర్గాలు తెలిపాయి. ముందుగా నిర్ణయించిన జాబితాలో ఉన్న వారికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో భద్రతా పరమైన ఇబ్బందులు తగ్గడంతో పాటు కార్యక్రమాల నిర్వహణ మరింత క్రమబద్ధంగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇటీవల జరిగిన కొన్ని కార్యక్రమాల్లో వేదికపైకి అనుమతి ఇవ్వలేదనే కారణంతో కొందరు నాయకులు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఘటనలను ఇంటెలిజెన్స్, ప్రొటోకాల్ విభాగాలు తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా కొత్త ప్రొటోకాల్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సభల భద్రత, నిర్వహణలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
















