ప్రతిపక్షం, జూలై 03: తెలంగాణ రాష్ట్ర అప్పుల అంశంపై బీఆర్ఎస్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి బహిరంగ సవాల్ విసిరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సాయంత్రం 5 గంటలకు చర్చకు సిద్ధంగా ఉంటానని ప్రకటించిన ఆయన, బీఆర్ఎస్ నేతలు కూడా ఆధారాలతో రావాలని కోరారు.
తాను చెబుతున్న అప్పుల లెక్కలు తప్పని నిరూపిస్తే మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తానని స్పష్టం చేసిన జూపల్లి, అదే విధంగా బీఆర్ఎస్ లెక్కలు తప్పితే వారు కూడా బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వచ్చి తన లెక్కలు తప్పని చెప్పాలని సవాల్ చేశారు.
కేటీఆర్, హరీశ్‌రావు అసెంబ్లీలో రాష్ట్ర అప్పులపై వేర్వేరు గణాంకాలు చెప్పారని ఆరోపించిన మంత్రి, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలను ఎందుకు వెల్లడించడం లేదని నిలదీశారు. కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి రాష్ట్రంపై భారీ అప్పు ఉందని పేర్కొంటూ, మిషన్ భగీరథ వంటి పథకాల కోసం తీసుకున్న రుణాలపై కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తాను ఎప్పుడూ అబద్ధాలు చెప్పే వ్యక్తిని కాదని, ఆత్మగౌరవం కోసం ప్రభుత్వ ఉద్యోగానికే రాజీనామా చేసిన వ్యక్తినని జూపల్లి పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వ్యాపారం కోసం రాలేదని, ప్రజల ముందే వాస్తవాలను ఉంచేందుకు ఎప్పుడైనా సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు.

















